బర్డ్‌ ఫ్లూ దెబ్బ.. కుదేలైన పాలమూరు పౌల్ట్రీ రంగం

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: ఒకప్పుడు కోళ్ల అరుపులు, వ్యాపార సందడితో కళకళలాడిన ఉమ్మడి మహబూబ్‌నగర్ (Mahabubnagar) జిల్లా పౌల్ట్రీ పరిశ్రమ (Poultry Industry) ఇప్పుడు సంక్షోభంలో చిక్కుకుంది. కష్టపడి పెంచిన కోళ్లు కళ్లముందే మృత్యువాత పడుతుండటంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. బర్డ్‌ ఫ్లూ భయం (Bird Flu Fear), చికెన్ ధరల పతనం, పెరుగుతున్న దాణా ఖర్చులు పౌల్ట్రీ రైతులపై ముప్పేట దాడి చేస్తున్నాయి. ఇటీవల నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో వేల సంఖ్యలో కోళ్లు ఆకస్మికంగా మృతి చెందడం కలకలం రేపింది. ముఖ్యంగా నాగర్‌కర్నూల్ జిల్లాలో సుమారు 5 వేల కోళ్లు బర్డ్‌ ఫ్లూ లక్షణాలతో మృతి చెందినట్లు వచ్చిన వార్తలు రైతులను భయాందోళనకు గురిచేస్తున్నాయి.

వనపర్తి జిల్లా రేవల్లి మండలంలో కూడా వందల సంఖ్యలో చనిపోయిన కోళ్లను కాలువల్లో పడవేయడం స్థానికంగా ఆందోళన కలిగించింది. జిల్లాలోని కొత్తకోట, రేవల్లి, మదనాపురం ప్రాంతాల్లో కోళ్ల మరణాలతో అధికారులు అప్రమత్తమయ్యారు. నాగర్‌కర్నూల్ జిల్లాలోని అల్లిపూర్, వడ్డెమాను, పెద్దకొత్తపల్లి, ఖానాపూర్ తదితర ప్రాంతాల్లోనూ కోళ్ల మృతి నమోదైనట్లు సమాచారం. కొన్ని ప్రాంతాల్లో జేసీబీలతో గోతులు తవ్వి కోళ్లను పూడ్చిపెట్టాల్సి రావడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

ధరలు పతనం.. రైతులపై పెనుభారం

బర్డ్‌ ఫ్లూ భయంతో చికెన్‌ వినియోగం తగ్గిపోవడంతో మార్కెట్‌లో ధరలు భారీగా పడిపోయాయి. ఒకప్పుడు కిలో చికెన్‌ రూ.200 వరకు ఉండగా.. కొన్ని సందర్భాల్లో రూ.50కి పడిపోయిన పరిస్థితులు ఉన్నాయని పౌల్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. గుడ్డు ధర కూడా ఒక్కోటి రూ.7 నుంచి రూ.5కు తగ్గినట్లు రైతులు పేర్కొంటున్నారు. చికెన్‌ సెంటర్లు వెలవెలబోతుండగా.. మరోవైపు ఫారాల్లో కోళ్లను పెంచేందుకు దాణా పెట్టలేని పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు, వ్యాపారులు ఇద్దరూ తీవ్ర ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నారు.

వేయికి పైగా పౌల్ట్రీ ఫారాలు

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో చిన్న, పెద్ద కలిపి వేయికి పైగా పౌల్ట్రీ ఫారాలు ఉన్నట్లు అంచనా. ఈ పరిశ్రమపై ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. ఏటా కోటి వరకు కోళ్ల పెంపకం సామర్థ్యం ఉన్న ఫారాలు జిల్లాలో ఉన్నట్లు పౌల్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. దాదాపు 44.5 లక్షల కోళ్ల సంపద ఉన్నట్లు సంబంధిత అధికారుల లెక్కలు సూచిస్తున్నాయి. ఇందులో కమర్షియల్ బ్రాయిలర్, లేయర్ కోళ్ల వాటా సుమారు 26 లక్షల వరకు ఉన్నట్లు సమాచారం.

ఇంటిగ్రేషన్ రైతుల పరిస్థితి కూడా దయనీయం

పౌల్ట్రీ రైతులు ప్రధానంగా రెండు విధానాల్లో కోళ్ల పెంపకం చేపడుతున్నారు. సొంతంగా ఫారం నిర్వహించే రైతులు కోడి పిల్లలు, దాణా, మందుల ఖర్చులను తామే భరించాల్సి ఉంటుంది. బర్డ్‌ ఫ్లూ కారణంగా కోళ్లు చనిపోతే పెట్టుబడితో పాటు అప్పుల భారం కూడా రైతులపైనే పడుతుంది. ఇంటిగ్రేషన్‌ విధానంలో కోడి పిల్లలు, దాణా వంటి వాటిని కంపెనీలు సమకూరుస్తాయి. రైతులు షెడ్లు, విద్యుత్, కూలీల ఖర్చులు భరిస్తారు. 40–45 రోజుల పాటు కోళ్లను పెంచిన తర్వాత అవి వ్యాధి కారణంగా చనిపోతే రైతులకు రావాల్సిన గ్రోయింగ్‌ ఛార్జీలు కూడా కోల్పోతారు. సాధారణంగా కిలోకు రూ.4 నుంచి రూ.6 వరకు మాత్రమే గ్రోయింగ్‌ ఛార్జీ లభిస్తుందని పౌల్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

సరిపోని పరిహారం

బర్డ్‌ ఫ్లూ నిర్ధారణై.. అధికారులు కోళ్లను చంపాల్సి వచ్చినప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50:50 నిష్పత్తిలో నష్టపరిహారం చెల్లిస్తాయి. కోళ్ల వయస్సు, గుడ్లు, నాశనం చేసిన దాణా తదితర అంశాల ఆధారంగా ప్రభుత్వం పరిహారం రేట్లను నిర్ణయిస్తుంది. అయితే ఈ పరిహారం ప్రస్తుత పెట్టుబడులతో పోలిస్తే సరిపోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బయట మార్కెట్‌లో ఒక్కో కోడిపై రూ.200–250 వరకు పెట్టుబడి అవుతుండగా.. ప్రభుత్వం అందించే పరిహారం అందులో సగానికి కూడా చేరడం లేదని చెబుతున్నారు. వ్యాధి కారణంగా కోళ్లు వాటంతట అవే చనిపోతే సాధారణంగా పరిహారం వర్తించకపోవడం కూడా రైతులకు మరో సమస్యగా మారింది.

ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి

పౌల్ట్రీ పరిశ్రమపై ఆధారపడిన వారిలో అత్యధికులు చిన్న, సన్నకారు రైతులే. బర్డ్‌ ఫ్లూ భయంతో మార్కెట్‌ పడిపోవడం, దాణా ధరలు పెరగడం, కోళ్ల మృతి వంటి పరిణామాలతో వారు తీవ్రంగా నష్టపోతున్నారు. పరిస్థితి మరింత విషమించకముందే ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపట్టి.. వ్యాధి నియంత్రణతో పాటు నష్టపోయిన పౌల్ట్రీ రైతులకు తగిన పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు. లేదంటే పాలమూరు పౌల్ట్రీ పరిశ్రమ కోలుకోవడానికి చాలా కాలం పట్టే అవకాశం ఉందని పౌల్ట్రీ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>