కలం, స్పోర్ట్స్ : భారత టెన్నిస్ స్టార్ యుకీ భాంబ్రీ (Yuki Bhambri) కి గాయమైంది. యూఎస్ ఓపెన్ మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ చేస్తుండగా ఆయన కుడికాలు కండరాలు పట్టేశాయి. దీంతో సీయోల్‌లో కొరియాతో జరగబోయే కీలక డేవిస్ కప్ పోరులో ఆయన ఆడటంపై తీవ్ర అనుమానాలు నెలకొన్నాయి.గురువారం రాత్రి సీయోల్ వెళ్లిన తొలి బ్యాచ్ ఆటగాళ్ల బృందంతో యుకీ ప్రయాణించలేదు. డేవిస్ కప్ ఫైనల్స్‌కు అర్హత సాధించాలంటే ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం భారత్‌కు చాలా ముఖ్యం. ఈ సమయంలో ఆయన దూరమవడం జట్టును కాస్త కలవరపెడుతోంది.
తన గాయంపై స్పందించిన యుకీ భాంబ్రీ అది చిన్న సమస్య మాత్రమేనని పేర్కొన్నారు. కోలుకోవడానికి నిర్దిష్ట సమయం లేకపోయినా, కంగారుపడాల్సిన అవసరం లేదని తెలిపారు. వైద్య నిపుణులు దేబాశిష్ దాస్, యష్ పాండే పర్యవేక్షణలో కోలుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. నొప్పులు ఉన్నందున రోజువారీ పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని వివరించారు. ఈ గాయం కారణంగా రాబోయే ఆసియా క్రీడలకు ఎలాంటి ఇబ్బంది లేదని యుకీ స్పష్టం చేశారు.
వంద శాతం ఆసియా క్రీడల్లో బరిలోకి దిగుతానని, డేవిస్ కప్ నాటికి కోలుకుంటానో లేదో వేచి చూడాలని అన్నారు. డబుల్స్‌లో కొరియాను ఓడించే సామర్థ్యం భారత జట్టుకు ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు.ఒకవేళ యుకీ దూరమైతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అఖిల భారత టెన్నిస్ సంఘం (AITA) దృష్టి పెట్టింది. కెప్టెన్ రోహిత్ రాజ్‌పాల్ కోరిక మేరకు అనిరుధ్ చంద్రశేఖర్‌ను సీయోల్ వెళ్లాల్సిందిగా కోరారు.

