‘ప్రజా పాలన’ కాదు.. తెలంగాణ విమోచన దినోత్సవమే కావాలి: నాగేశ్వర్ రెడ్డి

కలం, కరీంనగర్‌ : తెలంగాణ విమోచన దినోత్సవాన్ని (Telangana Liberation Day) సెప్టెంబర్‌ 17న రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇనుగొండ నాగేశ్వర్‌రెడ్డి (Inugonda Nageshwar Reddy) డిమాండ్‌ చేశారు. నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి లభించిన చారిత్రక సందర్భాన్ని విస్మరించడం సరికాదన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం విమోచన దినోత్సవం నిర్వహణ విషయంలో చిత్తశుద్ధి చూపడం లేదని విమర్శించారు. శుక్రవారం మానకొండూరు మండల కేంద్రంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

విమోచన చరిత్రను గుర్తించాలి

హైదరాబాద్‌ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం కావడంలో సర్దార్‌ వల్లభభాయ్‌ పటేల్‌ కీలక పాత్ర పోషించారని నాగేశ్వర్‌రెడ్డి (Inugonda Nageshwar Reddy) గుర్తుచేశారు. తెలంగాణ విముక్తి కోసం రజాకార్ల దౌర్జన్యాలను ఎదుర్కొంటూ అనేక మంది ప్రాణత్యాగాలు చేశారని తెలిపారు. స్వామి రామానందతీర్థ, బూర్గుల రామకృష్ణారావు తదితరుల నాయకత్వంలో సాగిన ఉద్యమంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో సామాన్య ప్రజలు చేసిన పోరాటం కూడా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందన్నారు.

‘ప్రజా పాలన’ పేరుతో రాజకీయాలు వద్దు

విమోచన పోరాటంలో పాల్గొన్న మహనీయుల త్యాగాలను భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. సెప్టెంబర్‌ 17ను ‘ప్రజా పాలన దినోత్సవం’ (Praja Palana Dinotsavam) పేరుతో నిర్వహించడం ద్వారా చారిత్రక నేపథ్యాన్ని పక్కన పెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ప్రభుత్వం రాజకీయ కోణంలో కాకుండా తెలంగాణ విమోచన చరిత్రకు తగిన గౌరవం ఇవ్వాలని కోరారు.

స్పందించకపోతే ఉద్యమం ఉధృతం

సెప్టెంబర్‌ 17ను రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా ‘తెలంగాణ విమోచన దినోత్సవం’గా నిర్వహించాలని ఆయన డిమాండ్‌ చేశారు. చరిత్రను మరుగునపరిచే ప్రయత్నాలను బీజేపీ అంగీకరించదని స్పష్టం చేశారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే ప్రజలతో కలిసి ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు రంగు భాస్కరాచారి, మానకొండూరు మండల అధ్యక్షులు కంది రాజిరెడ్డి, తిమ్మాపూర్ మండల అధ్యక్షులు శ్రీనివాస్, మాజీ మండల అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వర చారి, సెన్సార్ ఫిలిం బోర్డ్ మెంబర్ రాపాక ప్రవీణ్, జిల్లా నాయకులు అప్పని తిరుపతి, బొగ్గుల రమేష్, బూట్ల శ్రీనివాస్, దూలం కిరణ్ గౌడ్, మియాపురం లక్ష్మణచారి, కత్తి ప్రభాకర్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి భాషబోయిన ప్రదీప్ యాదవ్, మండల ఉపాధ్యక్షులు మీసా రమణయ్య, తిమ్మాపూర్ బీజేవైఎం మండల అధ్యక్షులు అరుణ్, బీజేవైఎం నాయకులు మర్రి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Also Read : దులీప్ ట్రోఫీ విజయం వెనుక ఎంఎస్ ధోనీ హస్తం!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>