​ధర్మపురిలో ఎంపీ వంశీకృష్ణ పూజలు.. స్కూల్‌కు రూ.18 లక్షలు మంజూరు

కలం, కరీంనగర్ బ్యూరో: పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ (MP Vamsi Krishna) శుక్రవారం ధర్మపురిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఎంపీకి సాంప్రదాయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు. ​

ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ.. ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ శంకుస్థాపన చేసిన ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించానని అన్నారు. పనులు ముందుకు సాగుతున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఢిల్లీలో ముందస్తు కార్యక్రమాల వల్ల గతంలో రాలేకపోయానని, అందుకే శుక్రవారం స్వామివారిని దర్శించుకున్నట్లు తెలిపారు.

​గత పదేళ్లలో ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంతో పాటు కోటిలింగాల ఆలయ అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని వంశీకృష్ణ విమర్శించారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పర్యటన అనంతరం ‘శుద్ధీకరణ’ పేరుతో నిర్వహించిన కార్యక్రమం దళితులను కించపరిచేలా ఉందని, ఇది బీజేపీ దళిత వ్యతిరేక విధానాలకు అద్దం పడుతోందని మండిపడ్డారు.

‘జై శ్రీరామ్’ పేరుతో ఓట్లు అడిగిన బీజేపీ ఆలయాల అభివృద్ధిని పట్టించుకోలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధి కోసం దాదాపు రూ.1,000 కోట్లతో పనులు చేపడుతోందని పేర్కొన్నారు. రాబోయే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని భక్తుల సౌకర్యార్థం ధర్మపురిలో ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

పాశిగామ ​స్కూల్‌కు రూ.18 లక్షలు మంజూరు

​విద్యారంగానికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్న ఎంపీ వంశీకృష్ణ.. పాశిగామ ప్రభుత్వ పాఠశాల సమగ్ర అభివృద్ధికి తన ఎంపీ నిధుల నుండి రూ.18 లక్షలు మంజూరు చేశారు. పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన బెంచీల ఏర్పాటుతో పాటు మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు ఈ నిధులను వెచ్చించనున్నట్లు తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఎలాంటి వసతుల కొరత ఉండకూడదన్నదే తమ లక్ష్యమని ఆయన (MP Vamsi Krishna) స్పష్టం చేశారు. విద్యార్థుల మెరుగైన భవిష్యత్తు కోసం ఎంపీ తీసుకున్న ఈ చొరవపై స్థానికులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. ​ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఆలయ సిబ్బంది భక్తులు పాల్గొన్నారు.

Also Read : చిట్యాల బీసీ జూనియర్‌ కళాశాలకు రూ. 10 కోట్లు మంజూరు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>