కలం, స్పోర్ట్స్ : మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) ఝార్ఖండ్ క్రికెట్‌కు (Jharkhand Cricket) నిశ్శబ్ద బలంగా నిలుస్తున్నారు. అధికారికంగా ఎలాంటి పదవిలో లేకపోయినా.. యువ క్రికెటర్లకు తన అనుభవంతో నిరంతరం దిశానిర్దేశం చేస్తున్నారు. తాజాగా ఈస్ట్ జోన్ జట్టు దులీప్ ట్రోఫీ విజయం సాధించడంలో ఝార్ఖండ్ ఆటగాళ్లు కీలక పాత్ర పోషించారు. కెప్టెన్ ఇషాన్ కిషన్ జట్టును ముందుండి నడిపించగా.. శిఖర్ మోహన్, కుమార్ కుషాగ్ర, మహమ్మద్ కౌనైన్ ఖురేషీ, అనుకూల్ రాయ్ అద్భుతంగా రాణించారు.
ధోనీ (MS Dhoni) రాంచీలో ఉన్న సమయంలో తప్పకుండా జేఎస్‌సీఏ స్టేడియాన్ని సందర్శిస్తారని జేఎస్‌సీఏ కార్యదర్శి సౌరభ్ తివారి తెలిపారు. అక్కడ ప్రాక్టీస్ చేస్తున్న ఆటగాళ్లతో స్వయంగా మాట్లాడి.. వారి సందేహాలను నివృత్తి చేస్తారని చెప్పారు. గతేడాది ముస్తాక్ అలీ ట్రోఫీ గెలిచిన తర్వాత కూడా ధోనీ తొలుత సందేశం పంపారని వెల్లడించారు.
ప్రతిభ ఉన్న ఆటగాళ్లను ఎలా గుర్తించాలి, మైదానంలో మైండ్ గేమ్‌ను ఎలా అర్థం చేసుకోవాలి వంటి అంశాలపై ధోనీ కీలక సూచనలు చేస్తారని తివారి పేర్కొన్నారు. ఆయన అనుభవం యువ క్రికెటర్లకు ఎంతో ఉపయోగపడుతోందన్నారు. ఝార్ఖండ్ నుంచి భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన తొలి ఆటగాడు ధోనీయేనని యు-23 కోచ్ ఇషాంగ్ జగ్గీ తెలిపారు. చిన్న రాష్ట్రాల నుంచి వచ్చిన ఆటగాళ్లు కూడా దేశ అత్యున్నత స్థాయికి చేరుకోగలరనే నమ్మకాన్ని ధోనీ కల్పించారని అన్నారు. పురుషుల, మహిళల జట్లకు ధోనీ అందిస్తున్న సూచనలు ఎంతో విలువైనవని పేర్కొన్నారు.
Also Read : చిట్యాల బీసీ జూనియర్ కళాశాలకు రూ. 10 కోట్లు మంజూరు
Follow Us On: X(Twitter)

