మంత్రి పొంగులేటి రాజీనామా చేయాలి : హరీశ్ రావు డిమాండ్

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్ రావు (Harish Rao) రాష్ట్ర ప్రభుత్వంపై, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నిషేధిత భూముల జాబితాలో పెట్టాల్సిన అసలైన భూములను వదిలేసి, ప్రజల సొంత ఆస్తులను 22A జాబితాలో చేర్చారని ఆయన ఆరోపించారు. జిల్లాల కలెక్టర్ల మెడపై కత్తిపెట్టి బలవంతంగా ఈ 22A జాబితాను తయారు చేయించారని, వివిధ జిల్లాల్లో పెద్ద ఎత్తున ప్రజల భూములను ఈ జాబితాలో చేర్చారని మండిపడ్డారు. చివరికి హెచ్ఎండీఏ ద్వారా వేలం వేసిన భూములను కూడా నిషేధిత జాబితాలోకి నెట్టేశారని విమర్శించారు.

సీసీఎల్ఏ ఆదేశాల మేరకే ఈ నిర్ణయాలు తీసుకున్నామని అధికారులు చెబుతున్నారని హరీశ్ రావు (Harish Rao) తెలిపారు. భూభారతి పోర్టల్‌లో దేవాదాయ, వక్ఫ్ భూముల వివరాలు ఏమాత్రం పొందుపరచలేదని ఆయన ఎత్తిచూపారు. ఈ అక్రమాలన్నింటినీ శాసనసభలో ఎక్కడ బయటపెడతారోననే భయంతోనే తమను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారని ఆరోపించారు.

22A కింద ఒక్క సెంటు భూమిని కూడా కొత్తగా నిషేధిత జాబితాలో పెట్టలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెబుతున్నారని హరీశ్ రావు ధ్వజమెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే తమ భూములను నిషేధిత జాబితాలో పెట్టారని ఆవేదన వ్యక్తం చేస్తుంటే, మంత్రి ఇంకా అబద్ధాలతో కాలయాపన చేయడం సరికాదన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఏమాత్రం నైతికత, బాధ్యత ఉన్నా వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

కేసీఆర్ పాలనలో భూ సమస్యలేమీ లేవని, ప్రజల సంక్షేమమే కేంద్రంగా నాటి పాలన సాగిందని బాధితులు స్పష్టం చేస్తున్నారని తెలిపారు. కేసీఆర్ సమస్యలను పరిష్కరిస్తే, రేవంత్ రెడ్డి మాత్రం 30 శాతం కమీషన్ల కోసం కొత్త సమస్యలను సృష్టిస్తున్నారని విమర్శించారు. సూర్యుడి చుట్టూ భూమి తిరిగినట్టు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంతా భూమి చుట్టూనే పరిభ్రమిస్తోందని ఎద్దేవా చేశారు. రాజ్యం అంటే కేవలం భూమి మాత్రమే కాదని, ఆ భూమిపై బతికే మనుషులనే విషయాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా మర్చిపోయిందని హరీశ్ రావు హితవు పలికారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>