కలం, వెబ్ డెస్క్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక్క రూపాయి ప్రీమియం కట్టాల్సిన అవసరం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే రూ.కోటి ఉచిత బీమా అమలు చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అసెంబ్లీలో తెలిపారు. 12,91,046 మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బందికి కూడా ఇది వర్తింపజేస్తుండటం తమ ప్రభుత్వ మానవీయతకు నిదర్శనమన్నారు. 16 ప్రముఖ బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుని బీమా అమలు చేస్తున్నట్లు వివరించారు. ఇప్పటివరకు 89 కుటుంబాలకు ఈ మేరకు బీమా అందించినట్లు గుర్తు చేశారు.
రూ.3 కోట్ల వరకు అందజేత..
బీమా అందించే విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. ప్రమాదవశాత్తు మరణం, శాశ్వత వైకల్యం వంటి సందర్భాల్లో రూ.కోటి బీమా, విమాన ప్రమాదంలో మరణిస్తే రూ. 2.20 కోట్ల నుంచి రూ. 3 కోట్ల వరకు వస్తుందన్నారు. సాధారణ ప్రమాదాలకు సంబంధించి కొన్ని ప్రత్యేక కేసుల్లో రూ.1.50 కోట్ల వరకు కూడా ఎక్కువ బీమా వస్తుందన్నారు. సింగరేణి ఉద్యోగులకు 2024లో అమలు చేయగా.. అక్కడ విజయవంతం కావడంతో దశలవారీగా అందరూ ఉద్యోగులకు వర్తింపజేస్తున్నామని స్పష్టం చేశారు.

