కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో తమ ప్రజాప్రతినిధులపై జరిగిన దాడి, పోలీసుల ప్రవర్తనను నిరసిస్తూ బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీల బృందం (BRS Delegation) ఢిల్లీలోని జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) సభ్యురాలు విజయ భారతిని కలసి ఫిర్యాదు చేసింది. అసెంబ్లీలో చోటుచేసుకున్న సంఘటన వివరాలను, తమపై దాడి జరిగిన తీరును నాయకులు కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు.
అదేవిధంగా తెలంగాణ అసెంబ్లీ వెలుపల మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు ప్రవర్తించిన తీరుపై జాతీయ మహిళా కమిషన్‌ను (NCW) కలసి వినతిపత్రం ఇచ్చేందుకు బిఆర్ఎస్ మహిళా ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ ఎమ్మెల్సీ సురభి వాణి దేవి మాట్లాడుతూ, సభ లోపలకు వెళ్లేందుకు యత్నించిన మహిళా ప్రజాప్రతినిధులను మహిళా, పురుష పోలీసులు అడ్డుకున్నారని ఆరోపించారు. సాధారణ చీరకట్టులో ఉన్న మహిళా శాసనసభ్యుల చీరలు, జుట్టు పట్టుకుని పోలీసులు అసభ్యంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం వల్లే తాము జాతీయ కమిషన్లను ఆశ్రయించి వినతిపత్రాలు ఇస్తున్నామని చెప్పారు.

