కలం, వెబ్ డెస్క్ : జోగులాంబ గద్వాల (Gadwal) జిల్లా రేపల్లి గ్రామంలో కులాంతర ప్రేమ వివాహం ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామానికి చెందిన రంగముని, మహేశ్వరి గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ మేజర్లు కావడంతో ఇటీవల వివాహం చేసుకుని రక్షణ కోసం పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు యువతి తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడగా, తాను ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నానని, తల్లిదండ్రుల వెంట వెళ్లేది లేదని మహేశ్వరి స్పష్టం చేసింది.
దీంతో ఆగ్రహానికి గురైన యువతి కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి గ్రామానికి వెళ్లారు. వేరే కులానికి చెందిన యువకుడు తమ అమ్మాయిని పెళ్లి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేక, ట్రాక్టర్లు, గడ్డపారలతో రంగముని ఇంటిపై దాడి చేసి నేలమట్టం చేశారు. అంతేకాకుండా అదే ప్రాంగణంలో ఉన్న ఆయన చిన్నాన్న ఇంటిని కూడా కూల్చివేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే గ్రామానికి చేరుకుని భద్రత ఏర్పాటు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

