కలం, నిజామాబాద్ బ్యూరో : తెలంగాణలోనే భారీ ఎకో ఫ్రెండ్లీ మట్టి వినాయకుడు (Eco-friendly clay Vinayaka) ఇందూరు (Nizamabad) నగరంలో కొలువు దీరనున్నాడు. ప్రతిసారి మహా మట్టి గణపతి ప్రతిష్టించే శ్రీ రవితేజ యూత్ గణేష్ మండలి (Sri Ravi Teja Youth Ganesh Mandali) ఈసారి 54 అడుగుల భారీ ఎకో ఫ్రెండ్లీ గణపతిని ప్రతిష్టిస్తున్నారు. ఈసారి శివలింగ అభిషేక గణపతి ఆకారాన్ని రూపొందిస్తుండడం చెప్పుకోదగ్గ విశేషం. ప్రతి సంవత్సరం ఒక కొత్త రూపంలో భారీ మట్టి వినాయకుడిని ప్రతిష్టించడం రవితేజ యూత్ ప్రత్యేకత.
25 రోజుల ఎకో ఫ్రెండ్లీ.. ఉన్నచోటే నిమజ్జనం
ఇందూరు నగరంలోని పోచమ్మ గల్లీలో ఏటా రవితేజ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్టించే మట్టి గణనాథుని విశేషాలు అన్ని ఇన్ని కావు. ఈ మట్టి విగ్రహం ప్రతిష్టించే చోటనే తయారు చేయడానికి కలకత్తా నుంచి ప్రత్యేకంగా కళాకారులు వస్తారు. 25 రోజులపాటు శ్రమించి ఈసారి వినాయకుని రూపొందిస్తున్నారు. మొత్తం 16 మంది కళాకారులు గణపతితో పాటు సెట్టింగ్ షెడ్ పూర్తి హంగులు తయారు చేస్తారు. ఇందులో ప్రత్యేకంగా ఎకో ఫ్రెండ్లీ గురించి చెప్పుకోవాల్సిందే.
కలకత్తా నుంచి వచ్చే కళాకారులు ప్రత్యేకంగా తీసుకొచ్చిన నది మట్టిని అలాగే వెదురు బొంగులు కృత్రిమ రంగులు రంగులు అలంకార సామాగ్రి అన్ని కూడా కలకత్తా నుంచి తీసుకొస్తారు. అసలు రసాయన వస్తువులు గాని రంగులు కానీ పీఓపీ కానీ ఏవి కూడా వినియోగించరు. వినాయక చవితి ఉత్సవాల అనంతరం నిమజ్జనం కూడా ప్రతిష్టించిన చోటే ఉంటుంది. నీళ్లతో పూర్తిగా ఉన్నచోటే విగ్రహానికి నిమజ్జన కార్యక్రమం నిర్వహిస్తారు
లింగ అభిషేక గణపతి పోస్టర్ల ఆవిష్కరణ
రవితేజయూత్ సొసైటీ గణేష్ మండలి, పోచమ్మ గల్లీ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నెలకొల్పే 54 అడుగుల మట్టి వినాయక విగ్రహం నమూనా చిత్రాన్ని ఇందూరు ఎమ్మెల్యే ధనపాల్ సూర్య నారాయణ గుప్తా ఆవిష్కరించారు. ఇందూరులో అన్ని గణేష్ మండపాలు కూడా మట్టి గణపతులను ఏర్పాటు చేయాలనీ ఈ సందర్భంగా ధన్పాల్ సూర్యనారాయణ పిలుపునిచ్చారు. రవితేజ యూత్ అధ్యక్షులు నీలగిరి రాజు, ప్రధాన కార్యదర్శి తర్ల రమేష్, కోశాధికారి గైని మహేందర్, ఉపాధ్యక్షులు గైని దయసాగర్, లీగల్ అడ్వయిసార్ పులి జైపాల్, తర్ల రాజేందర్, కిరణ్ తేజ, రాము, వినయ్, మధు,శ్రీకాంత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
ఆదర్శవంతమైన బాటలో రవితేజ యూత్
ఇందూరు నగరంలో రవితేజ యూత్ 1987లో ఏర్పాటయింది. అయితే 2012 గణేష్ మండలి సిల్వర్ జూబ్లీ సందర్బంగా శ్రీ రవితేజ యూత్ సొసైటీగా మారింది. సిల్వర్ జూబ్లీ సందర్బంగా పర్యావరణాన్ని కాపాడాలని ఉద్దేశంతో యూత్ సభ్యులు సంకల్పం తీసుకున్నారు. అప్పటినుండి ఏటా వరుసగా ఈ యేడు దాకా ప్రతి సంవత్సరం ఒక ఆకారంలో భారీ మట్టి వినాయక విగ్రహాలు ప్రతిష్టిస్తూ ప్రజల మన్ననలు పొందుతోంది..
చెరువులు పొలాలు శ్రేష్టం చేయాలి .. రవితేజ యూత్ అధ్యక్షుడు నీలగిరి రాజు
ఏటా వినాయక చవితి సందర్భంగా రసాయన విగ్రహాలను చెరువులలో నిమజ్జనం చేయడం వల్ల ఆ నీళ్లు కలుషితమవుతున్నాయి. అమ్మ లాంటి పొలాలు కాలుష్య కాసారాలుగా మారుతున్నాయి. మనం తినే భోజనం వచ్చే పొలాలు వాటికి నీళ్లు అందించే చెరువులను శ్రేష్టం చేసి కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. అంతేకాకుండా పర్యావరణాన్ని కాపాడాలి POP (ప్లాస్టర్ ఆఫ్ పారిస్) వల్ల అనర్థాలు ఏర్పడుతున్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని అందరూ మట్టి గణపతులు ప్రతిష్టించాలి అని ఆయన అన్నారు.

