‘కుడా’ పీఠం.. వరంగల్ కాంగ్రెస్‌లో మంటలు!

కలం, వరంగల్‌ బ్యూరో: కాంగ్రెస్‌లో పదవుల పందేరం ఆ పార్టీ సెకండ్ కేడర్ నాయకుల్లో అసంతృప్తికి కారణమవుతోందన్న చర్చ జరుగుతోంది. పార్టీ కోసం ఏళ్లుగా జెండా మోసిన వారిని కాదని.. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి వరుసగా కీలక పదవులు దక్కుతున్నాయన్న భావన బలపడుతున్నట్లు ప్రచారం సాగుతోంది. తాజాగా గుండు సుధారాణికి కాకతీయ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (KUDA) చైర్‌పర్సన్‌ పదవి దక్కడంతో ఈ అసంతృప్తి మరింత పెరిగినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

ఆశలు పెట్టుకున్న నేతలకు షాక్‌!

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ‘కుడా’ చైర్‌పర్సన్‌ పదవిపై ఆ పార్టీకి చెందిన పలువురు సీనియర్‌, సెకండ్‌ క్యాడర్ లీడర్లు ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ కార్యక్రమాలు, ఉద్యమాలు, ఎన్నికల్లో ముఖ్య పాత్ర పోషించిన తమకు అవకాశం వస్తుందని భావించారు. కొంతమంది తమ గాడ్ ఫాదర్‌ల ద్వారా సీఎం రేవంత్‌రెడ్డికి సిఫారసు చేయించుకున్నారు. అయితే అనూహ్యంగా గుండు సుధారాణి పేరు తెరపైకి రావడంతో ఆశావహుల్లో నిరాశ నెలకొన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

కొండా ఎపిసోడ్‌.. బీసీ సమీకరణాలు?

కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించిన తర్వాత ఉమ్మడి వరంగల్‌ కాంగ్రెస్‌ (Warangal Congress)లో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారాయి. ఈ నేపథ్యంలో బీసీ వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా రాజకీయంగా నష్టనివారణ చర్యలు చేపట్టాలన్న ఆలోచనలో భాగంగానే గుండు సుధారాణికి ‘కుడా’ పగ్గాలు అప్పగించారన్న చర్చ కూడా పార్టీలో వినిపిస్తోంది. అయితే సామాజిక సమీకరణాలతో పాటు పార్టీ కోసం పనిచేసిన నాయకుల సేవలను కూడా గుర్తించాలని పలువురు నేతలు కోరుతున్నట్లు తెలుస్తున్నది.

స్థానిక ఎన్నికల వేళ ప్రభావం?

త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ అసంతృప్తి కాంగ్రెస్‌కు ఇబ్బందికరంగా మారుతుందా అన్న చర్చ మొదలైంది. గ్రామస్థాయి నుంచి నగర స్థాయి వరకు పార్టీ కోసం పనిచేసే సెకండ్‌ కేడర్‌ నేతలే ఎన్నికల సమయంలో కీలకంగా వ్యవహరిస్తారు. అలాంటి వారిలో అసంతృప్తి పెరిగితే దాని ప్రభావం క్యాడర్‌ సమన్వయంపై పడే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అధిష్ఠానం ఏం చేస్తుంది?

ఒకవైపు సామాజిక సమీకరణాలు.. మరోవైపు పార్టీ కోసం పనిచేసిన నాయకుల ఆకాంక్షలు. ఈ రెండింటి మధ్య కాంగ్రెస్‌ అధిష్ఠానం ఎలాంటి సమతుల్యత పాటిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ‘కుడా’ చైర్‌పర్సన్‌ ఎంపికతో మొదలైన ఈ అసంతృప్తి మరింత పెరుగుతుందా? లేక స్థానిక నాయకత్వం, అధిష్ఠానం జోక్యంతో చల్లారుతుందా? అన్నది వేచి చూడాలి.

పార్టీ మారిన వారికి ప్రాధాన్యమా?

గుండు సుధారాణి గతంలో టీడీపీ, బీఆర్ఎస్ పార్టీల్లో పనిచేసి వివిధ పదవులు నిర్వహించారు. బీఆర్ఎస్ హయాంలో వరంగల్ మేయర్గా కూడా కొనసాగారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె ఆ పార్టీ గూటికి చేరారు. ఇప్పుడు అదే పార్టీ నుంచి చైర్పర్సన్గా అవకాశం దక్కడంపై కాంగ్రెస్లో మొదటి నుంచి కొనసాగుతున్న కొందరు నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ‘‘పార్టీ కోసం ఇన్నేళ్లుగా పనిచేస్తున్న మాకు పదవులు చేపట్టే అర్హత లేదా?” అన్న అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లు చర్చ సాగుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>