కలం, తెలంగాణ బ్యూరో: గ్రామ పంచాయతీల సొంత ఆదాయాన్ని నేరుగా జీపీ బ్యాంకు ఖాతాల్లో జమ చేసేలా తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) చట్ట సవరణ చేసింది. పంచాయతీరాజ్ చట్టం–2018లోని సెక్షన్ 70(3)కు సవరణ చేస్తూ ప్రవేశపెట్టిన బిల్లుకు శాసనసభ, శాసనమండలిలో ఏకగ్రీవ ఆమోదం లభించింది. గురువారం మంత్రి సీతక్క బిల్లును ప్రవేశ పెట్టగా.. ఉభయ సభల్లో ఆమోదం పొందింది.
అత్యవసర పనులకు వినియోగించుకునేలా..
గ్రామ పంచాయతీల సొంత ఆదాయం ప్రస్తుతం ట్రెజరీలో జమ చేసి, అవసరమైనప్పుడు తిరిగి డ్రా చేసుకోవాల్సి రావడంతో నిధుల వినియోగంలో జాప్యం జరుగుతోందని మంత్రి సీతక్క తెలిపారు. డ్రైనేజీ, తాగునీరు, వీధి దీపాలు, పారిశుద్ద్యం వంటి అత్యవసర పనులకు నిధులు వెంటనే అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ సవరణ చేస్తున్నామని చెప్పారు.
ప్రతి నెలా రూ.50 కోట్లు..
గ్రామ సభ తీర్మానం మేరకు పంచాయతీ అవసరాలకు సొంత ఆదాయాన్ని ఖర్చు చేసుకునే అవకాశం ఉంటుందని మంత్రి సీతక్క వెల్లడించారు. మున్సిపాలిటీలకు ఉన్న ఈ వెసులుబాటు పంచాయతీలకు లేకపోవడం గత ప్రభుత్వ వివక్షకు నిదర్శనమని విమర్శించారు. బీసీ రిజర్వేషన్ల కారణంగా పంచాయతీ ఎన్నికలు ఆలస్యమయ్యాయని, ఆ కాలానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు పూర్తిస్థాయిలో రాలేదని తెలిపారు. ప్రస్తుతం ప్రతి నెల జీపీల కోసం రూ.50 కోట్లు ఖర్చు చేస్తున్నామని, 2025–26 రెండో విడతగా కేంద్రం నుంచి రూ.619 కోట్లు రావాల్సి ఉందని తెలిపారు. మల్టీపర్పస్ వర్కర్లకు ప్రతి నెల మొదటి తేదీనే జీతాలు చెల్లిస్తున్నామని మంత్రి చెప్పారు.

