బీఆర్ఎస్ గ్రాఫ్ డౌన్.. ప్రజల్లో వ్యతిరేకత!

కలం, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ సమావేశాల తొలి రోజున బీఆర్ఎస్ (BRS) అనుసరించిన వైఖరి, దాన్ని తిప్పికొట్టడంలో కాంగ్రెస్ ప్రదర్శించిన తీరుపై ప్రభుత్వానికి రిపోర్ట్ చేరింది. ఫ్లాష్ సర్వే రూపంలో అన్ని జిల్లాల నుంచి ర్యాండమ్‌గా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ మూడు రోజుల్లో చోటుచేసుకున్న పరిణామాల ఆధారంగా చేపట్టిన ఈ సర్వేలో ప్రజల్లో బీఆర్ఎస్‌పై వ్యతిరేకత బాగా పెరిగినట్లు తేలింది. ఆ పార్టీ గ్రాఫ్ డౌన్ అయినట్లు వెల్లడైంది.

కాంగ్రెస్‌పై ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత లేకపోగా, దళిత సెక్షన్ నుంచి పాజిటివ్ సిగ్నల్స్ వచ్చినట్లు స్పష్టమైంది. ఈ అంశాలను సీఎల్పీ సమావేశంలో కొద్ది మంది ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించినట్లు తెలిసింది. ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యలు, పసుపు నీళ్లతో శుద్ధి వరకు మొత్తం వ్యవహారం బీఆర్ఎస్‌ను బాగా డ్యామేజ్ చేసిందని సర్వేలో వెల్లడైంది. ఏయే కారణాలతో ప్రజలు బీఆర్ఎస్‌ను తప్పుపడుతున్నారో, కాంగ్రెస్‌ను అభినందిస్తున్నారో కూడా నిర్దిష్టమైన సమాచారమే వచ్చినట్లు తెలిసింది.

మూడు రోజుల్లో మారిన సీన్..

ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతోందని బీఆర్ఎస్ ఇప్పటి వరకు ప్రచారం చేసుకోగా, తాజాగా మూడు రోజుల్లోనే ఆ పార్టీ అంచనాలు తలకిందులయ్యాయి. ఫ్లాష్ సర్వేతో సంబంధం లేకుండా బీఆర్ఎస్ నేతలే తాతా మధు ఎపిసోడ్‌, ఎర్రవల్లిలోని పసుపు నీళ్ల శుద్ధి అంశం పార్టీని కోలుకోలేని దెబ్బతీసిందని భావిస్తున్నారు. ప్రభుత్వం మీద వ్యతిరేకత కాస్తా తమ మీదకు మళ్లిందనే ఫీలింగ్ ఆ పార్టీ లీడర్లలో వ్యక్తమవుతోంది.

ముఖ్యమంత్రికి చేరిన సర్వే రిపోర్టులో చాలా అంశాలున్నా, వేటినీ నిర్దిష్టంగా ప్రస్తావించకుండా మొత్తంగా ప్రజల అభిప్రాయం ఎలా ఉందనేది మాత్రమే కొద్దిమంది ఎమ్మెల్యేలతో షేర్ చేసుకున్నట్టు తెలిసింది. బీఆర్ఎస్‌ను దళిత సెక్షన్ చీదరించుకునే స్థాయికి చేరుకుందని, వారి ఆత్మగౌరవ ఇష్యూను కాంగ్రెస్ సరైన తీరులో టేకప్ చేసిందని ఫ్లాష్ సర్వేలో తేలింది. దీనికి తోడు ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నట్లుగా ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత లేదనేది కూడా వెల్లడైంది. బీఆర్ఎస్‌నే మెజారిటీ ప్రజలు తప్పుపడుతున్నారన్నది ఈ ఫ్లాష్ సర్వే రిపోర్టు సారాంశం.

దళిత వ్యతిరేక పార్టీగా..

ప్రస్తుత పరిణామాలు భవిష్యత్తులో బీఆర్ఎస్‌కు మరింత డ్యామేజ్ చేస్తాయని, ఆ పార్టీ నేతల మధ్య ఏర్పడిన గ్యాప్, ఆధిపత్య పోరు తీవ్రమవుతోందని కాంగ్రెస్ ఆలోచన. తాజా సర్వే రిపోర్టులో వెల్లడైన అంశాలను పరిగణనలోకి తీసుకున్న కాంగ్రెస్, రానున్న రోజుల్లో నిర్దిష్టమైన యాక్షన్ ప్లాన్ రూపొందించి ప్రజల్లో ప్రత్యేక క్యాంపెయిన్ చేపట్టేలా ఆలోచన చేస్తోంది. రిపోర్టులో పూర్తి వివరాలను ఎమ్మెల్యేలకు వివరించకపోయినా, దీని ఆధారంగా పార్టీ తరఫున ఓరియెంటేషన్ పెట్టి తదుపరి కార్యాచరణపై దిశానిర్దేశం చేయించాలన్నది ముఖ్యమంత్రి ఆలోచన.

ప్రజల్లో బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోవడం, అది చేస్తున్న ప్రచారాన్ని జనం నమ్మకపోవడం, దాని పట్ల ఆదరణ పెరగకపోవడం.. ఇలాంటివన్నీ సీఎం బేరీజు వేస్తున్నారు. పదేండ్ల కాలంలో సభా సమావేశాల నిర్వహణలో ఆ పార్టీ అనుసరించిన వైఖరి, ఇప్పుడు స్పీకర్ చైర్‌ను, కులాన్ని, రాజ్యాంగబద్ధమైన గౌరవాన్ని లెక్క చేయకుండా హేళనగా మాట్లాడడం, సభలో దాన్ని కాంగ్రెస్ నేతలు ఎండగట్టడం ప్రజలకు వాస్తవాలు తెలియడానికి దోహదం కలిగించిందన్నది కూడా మరో కీలకమైన అంశం.

త్వరలో కాంగ్రెస్ క్యాంపెయిన్..

  • ఇప్పుడు ప్రజల్లో పలుచబడిన బీఆర్ఎస్‌ను మరింత డ్యామేజ్ చేయడంపై కాంగ్రెస్ రానున్న రోజుల్లో ఫోకస్ పెట్టనుంది.
  •  ఈ మూడు రోజుల పరిణామాలు, కేటీఆర్ ప్లాన్ ప్రకారం ఆ పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యేలను రాజకీయాల కోసం పావుగా వాడుకోవడానికి గంగుల కమలాకర్‌ సైగలు చేయడం.. ఇవన్నీ మరింతగా జనంలో ప్రచారం చేయడంపై కాంగ్రెస్ ఆలోచన చేస్తోంది.
  • దళిత వ్యతిరేక స్వభావంతో పాటు రాజకీయాల కోసం సొంత పార్టీ మహిళా ఎమ్మెల్యేలనే టార్గెట్ చేసుకోవడం, పొలిటికల్ బెనిఫిట్ కోసం నీచానికి దిగజారడం.. ఇలాంటి వాటిని ప్రజలకు అర్థమయ్యే తీరులో వివరించి గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లి మరింత డ్యామేజ్ చేయాలనేది కాంగ్రెస్ ఆలోచన.
  • ఇందుకోసం అసెంబ్లీ సెషన్ అయిపోయిన తర్వాత సీఎం, కాంగ్రెస్ స్టేట్ ఇన్‌ఛార్జి, పీసీసీ చీఫ్ సమావేశమై వ్యూహం రూపొందిస్తారని తెలుస్తోంది.
మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>