కలం, కరీంనగర్ బ్యూరో: దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర జేఏసీ పిలుపునిచ్చిన ‘చలో హైదరాబాద్’ కార్యక్రమానికి కరీంనగర్ జిల్లా నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, అంగన్వాడీ సిబ్బంది అపూర్వ స్పందన తెలిపారు. ప్రభుత్వ పెద్దల విజ్ఞప్తి మేరకు ఈ కార్యక్రమానికి తాత్కాలిక విరామం మాత్రమే ఇచ్చామని, ఇది ఉద్యమానికి ముగింపు కాదని కరీంనగర్ ఉద్యోగుల జేఏసీ నాయకులు (Employees JAC) స్పష్టం చేశారు. ఈ నెల 18 తర్వాత రాష్ట్ర జేఏసీ ప్రకటించే తదుపరి కార్యాచరణకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
సమర సన్నాహం.. కరీంనగర్ ఐక్యత
ఈ నెల 8న కరీంనగర్లో నిర్వహించిన సన్నాహక సమావేశానికి దాదాపు 5,000 మంది హాజరై ఉద్యమ స్ఫూర్తిని చాటారు. చలో హైదరాబాద్ కోసం జిల్లా నుండి 10,000 మందికి పైగా సిబ్బంది వాహనాలు సమకూర్చుకుని, సామూహిక సెలవులు పెట్టి సిద్ధమయ్యారని నాయకులు తెలిపారు. పీఆర్సీ అమలు చేయకపోవడం, 6 డీఏలు పెండింగ్లో ఉండటం, హెల్త్ కార్డుల లోపాలు, దాచుకున్న సొమ్ము కోసం ధర్నాలు చేయాల్సి రావడం, సీపీఎస్ రద్దు వంటి డిమాండ్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోందన్నారు.
ప్రభుత్వ విజ్ఞప్తితో తాత్కాలిక విరామం
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రిన్సిపల్ సెక్రటరీ (ఫైనాన్స్), జీఏడీ అధికారులు జేఏసీ నాయకులను చర్చలకు పిలిచి సమయం కోరడంతో, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదనే బాధ్యతతోనే తాత్కాలికంగా ఒక అడుగు వెనక్కి వేసినట్లు వివరించారు. “ఉద్యోగులు చల్లబడలేదు… నిగురుగప్పిన నిప్పులా రగులుతున్నారు” అని జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోతే, 18వ తేదీ తర్వాత ఉద్యమం మరింత ఉధృతమవుతుందని హెచ్చరించారు.
అధైర్యపడవద్దు.. పోరాటం కొనసాగుతుంది..
గతంలో ఎస్మా, రాజద్రోహం వంటి పరిస్థితులను సైతం ఎదుర్కొన్న చరిత్ర ఉద్యోగులదని, ఈ విరామం కేవలం వ్యూహాత్మక మౌనం మాత్రమేనని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. సన్నాహకాల్లో పాల్గొని మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ శిరస్సు వంచి ఉద్యమాభివందనాలు తెలిపారు.
ఈ ప్రకటనలో కరీంనగర్ జిల్లా జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాసరెడ్డి, కన్వీనర్ మడిపల్లి కాళీ చరణ్ గౌడ్, కార్యదర్శులు సంఘం లక్ష్మణరావు, అడ్ల అరవింద్ రెడ్డి, నాయకులు కోటా రామస్వామి, ఉస్మాన్ పాషా, కేశవరెడ్డి, ప్రభాకర్ రావు, కిరణ్ కుమార్ రెడ్డి, PRTU, TTU, DTF, STU, తదితర ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

