‘బ్రహ్మోస్ క్షిపణి’ భూసేకరణ.. రైతులతో కలెక్టర్ చర్చలు

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: బ్రహ్మోస్ క్షిపణి తయారీ (BrahMos Missile Project) పరిశ్రమ ఏర్పాటుతో మహబూబ్‌నగర్ జిల్లాలో పారిశ్రామికంగా, ఆర్థికంగా గణనీయమైన అభివృద్ధికి అవకాశాలు ఏర్పడనున్న నేపథ్యంలో, ప్రాజెక్టు కోసం భూములు కోల్పోయే రైతుల ప్రయోజనాలను పరిరక్షిస్తూ భూసేకరణ ప్రక్రియను చేపడతామని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా తెలిపారు. రైతులకు న్యాయం జరిగేలా, చట్టపరమైన నిబంధనల మేరకు సాధ్యమైనంత మెరుగైన పరిహారం అందించే అంశాన్ని పరిశీలిస్తామని ఆమె స్పష్టం చేశారు.

జీవనోపాధి, భవిష్యత్ ప్రయోజనాలపై చర్చ..

దేవరకద్ర మండలం బస్వాయిపల్లి గ్రామంలో బ్రహ్మోస్ ప్రాజెక్టు ఏర్పాటుకు చేపట్టనున్న భూసేకరణకు సంబంధించి గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన నెగోసియేషన్ కమిటీ సమావేశంలో కలెక్టర్ ఖుష్బూ గుప్తా రైతులు, గ్రామ సర్పంచ్, ప్రజాప్రతినిధులతో చర్చించారు. భూసేకరణ పరిహారం, భూముల ప్రస్తుత మార్కెట్ విలువ, భూములు కోల్పోయే రైతుల జీవనోపాధి, భవిష్యత్ ప్రయోజనాలు తదితర అంశాలపై రైతుల అభిప్రాయాలను ఆమె స్వయంగా తెలుసుకున్నారు.

“మీ భూములకు ఎంత పరిహారం ఆశిస్తున్నారు? భూసేకరణకు సంబంధించి మీ అభిప్రాయాలు, అభ్యంతరాలను స్పష్టంగా తెలియజేయండి” అని రైతులను కలెక్టర్ కోరారు. రైతులు తమ భూములకు ప్రస్తుత మార్కెట్ విలువను దృష్టిలో ఉంచుకుని మెరుగైన పరిహారం అందించాలని కోరారు. భూమికి బదులుగా భూమి కేటాయించడంతో పాటు తగిన పరిహారం అందించాలని, భూములు కోల్పోయిన అనంతరం జీవనోపాధికి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

చిన్న, సన్నకారు రైతులను పరిగణనలోకి తీసుకోవాలి..

బస్వాయిపల్లి గ్రామ సర్పంచ్ శివకుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రానికి, ముఖ్యంగా మహబూబ్‌నగర్ జిల్లాకు బ్రహ్మోస్ వంటి ప్రతిష్టాత్మక పరిశ్రమ రావడం గర్వకారణమన్నారు. అయితే గ్రామంలో అధిక శాతం ఒకటి నుంచి మూడు ఎకరాల వరకు భూమి కలిగిన చిన్న, సన్నకారు రైతులే ఉన్నారని తెలిపారు. వ్యవసాయం, పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న రైతులు భూములు కోల్పోతే వారి జీవనోపాధిపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు.

అందువల్ల భూమికి బదులుగా భూమి కేటాయించడంతో పాటు అదనపు పరిహారం అందించి రైతులకు భరోసా కల్పించాలని కోరారు.
గ్రామ ప్రతినిధి శ్రీనివాస్ మాట్లాడుతూ, బ్రహ్మోస్ ప్రాజెక్టు జిల్లాకు రావడం పట్ల గ్రామస్తులు సంతోషంగా ఉన్నప్పటికీ, తమ భూములను కోల్పోతున్న రైతుల విషయంలో ఆందోళన ఉందన్నారు. రైతుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత మార్కెట్ విలువ కంటే మెరుగైన పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

సమతుల్యంగా రైతుల ప్రయోజనాలు–ప్రాజెక్టు అభివృద్ధి..

కలెక్టర్ ఖుష్బూ గుప్తా మాట్లాడుతూ.. బ్రహ్మోస్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు జిల్లాకు రావడం ద్వారా పారిశ్రామిక అభివృద్ధితో పాటు ఉపాధి, ఆర్థిక కార్యకలాపాలు పెరిగే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయమని తెలిపారు. ప్రాజెక్టు ద్వారా జిల్లాకు కలిగే అభివృద్ధి అవకాశాలను, అదే సమయంలో భూములు కోల్పోయే రైతుల ప్రయోజనాలను సమతుల్యం చేస్తూ భూసేకరణ ప్రక్రియను కొనసాగిస్తామని  చెప్పారు.

రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా, చట్టపరమైన నిబంధనలను పాటిస్తూ సాధ్యమైనంత మెరుగైన పరిహారం అందించే అంశాన్ని పరిశీలిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. భూసేకరణ చట్టంలోని నిబంధనలు, రిజిస్ట్రేషన్ విలువలు, భూముల మార్కెట్ విలువలు, పరస్పర సమ్మతి (కన్సెంట్) ఆధారంగా లభించే పరిహారం తదితర అంశాలను రైతులకు వివరించారు.

సాధారణ అవార్డు ద్వారా లభించే పరిహారంతో పోలిస్తే, రైతులు పరస్పర సమ్మతితో ముందుకు వస్తే నిబంధనల మేరకు మెరుగైన పరిహారం పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. ఇది ప్రాథమిక దశ చర్చ మాత్రమేనని, ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉన్న డేటా, చట్టపరమైన నిబంధనలు, రిజిస్ట్రేషన్ విలువలు, ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను సమగ్రంగా పరిశీలించిన అనంతరం తదుపరి వివరాలను రైతులకు తెలియజేస్తామని చెప్పారు. రైతులు కూడా గ్రామస్థాయిలో సమావేశమై పరస్పరం చర్చించుకుని తమ అభిప్రాయాలను, ఆచరణాత్మక ప్రతిపాదనలను అధికారులకు తెలియజేయాలని కలెక్టర్ సూచించారు.

సర్వే వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలి..

భూసేకరణకు సంబంధించి చేపట్టిన సర్వేలో భూమి విస్తీర్ణం, సర్వే నంబర్లు, పట్టా భూములు, కబ్జా వివరాలు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సర్వే వివరాలపై రైతులకు ఏవైనా అభ్యంతరాలు లేదా సమస్యలు ఉంటే వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని సూచించారు.

రైతులు, ప్రజాప్రతినిధులు గ్రామస్థాయిలో మరోసారి సమావేశమై వాస్తవ పరిస్థితులు, భూముల ప్రస్తుత ధరలు, రైతుల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని ఆచరణాత్మక ప్రతిపాదనలతో ముందుకు రావాలని కోరారు. బ్రహ్మోస్ ప్రాజెక్టు అభివృద్ధి, రైతుల ప్రయోజనాలు రెండింటినీ సమన్వయం చేస్తూ భూసేకరణ ప్రక్రియను పారదర్శకంగా, న్యాయబద్ధంగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.ఎల్.బి. హరిప్రియ, అసిస్టెంట్ కలెక్టర్ (అండర్ ట్రైనీ) సాయి శివాని, ఆర్.డీ.ఓ. నవీన్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు, గ్రామ సర్పంచులు, రైతులు, గ్రామస్తులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>