కలం, నిర్మల్ : మధ్యాహ్న భోజన పథకం కార్మికుల (Midday Meal Workers) పెండింగ్ వేతనాలు, బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో గురువారం నిర్మల్ (Nirmal) సమీకృత కలెక్టరేట్‌లోని జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం (DEO Office) ఎదుట ధర్నా నిర్వహించారు. కార్మికులు కార్యాలయ ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాలను నెలకు రూ.10 వేలకు పెంచాలని వారు డిమాండ్ చేశారు. నెలల తరబడి వేతనాలు, బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే మార్కెట్ ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు, కోడిగుడ్ల బిల్లులను పెంచాలని, పెండింగ్‌లో ఉన్న అల్పాహారం బిల్లులను వెంటనే చెల్లించాలని కోరారు. రాగిజావకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వమే నిర్వహించాలని, ప్రైవేట్ సంస్థలకు అప్పగించవద్దని కార్మికులు (Midday Meal Workers) కోరారు. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ధర్నాలో యూనియన్ నాయకురాలు కే. రాధా, లక్ష్మి, సునీత, బాను తదితరులు పాల్గొన్నారు.
Also Read : అంతర్జాతీయ స్పేస్ సమ్మిట్‌లో మోదీ కీలక వ్యాఖ్యలు
Follow Us On : WhatsApp

