డబ్బుల వసూళ్లపై డీఎస్పీ సీరియస్.. ట్రాన్స్‌జెండర్లకు కీలక హెచ్చరిక

కలం, నల్లగొండ : సమాజంలో ప్రతి ఒక్కరూ చట్టాలను గౌరవిస్తూ, ఇతరులకు ఇబ్బందులు కలగకుండా గౌరవప్రదమైన జీవనం సాగించాలని నల్గొండ డీఎస్పీ (Nalgonda DSP) కె. శివరాం రెడ్డి (Shivaram Reddy) సూచించారు. నల్గొండ పట్టణ పరిధిలోని ట్రాన్స్‌జెండర్లతో ఆయన ప్రత్యేక అవగాహన సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల హక్కులు, ట్రాన్స్‌జెండర్ల బాధ్యతలపై పలు కీలక సూచనలు చేశారు. వ్యాపార సంస్థలు, దుకాణాలు, ఇళ్లు, ట్రాఫిక్ సిగ్నల్స్, పండుగలు, శుభకార్యాల సందర్భాల్లో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ బలవంతంగా డబ్బులు డిమాండ్ చేయడం లేదా వసూలు చేయడం చేయకూడదని డీఎస్పీ స్పష్టం చేశారు. ఎవరైనా స్వచ్ఛందంగా ఇచ్చే సహాయాన్ని మాత్రమే స్వీకరించాలని, డబ్బు కోసం ఒత్తిడి తెచ్చినా, బెదిరింపులకు దిగినా, అసభ్యకరంగా ప్రవర్తించినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ప్రజల నుంచి ఇలాంటి ఫిర్యాదులు వస్తే నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేస్తామన్నారు. అదే సమయంలో ట్రాన్స్‌జెండర్లు ఎదుర్కొంటున్న సమస్యలు, వేధింపులు లేదా ఇతర చట్టపరమైన ఇబ్బందులు ఉంటే భయపడకుండా పోలీసులను సంప్రదించాలని, పోలీస్ శాఖ తరఫున పూర్తి సహకారం అందిస్తామని డీఎస్పీ భరోసా ఇచ్చారు. ట్రాన్స్‌జెండర్లు కూడా సమాజంలో ఒక భాగమేనని, వారి పట్ల ప్రతి ఒక్కరూ గౌరవభావంతో వ్యవహరించాలని కోరారు. అదే సమయంలో వారు కూడా ప్రజల హక్కులకు భంగం కలగకుండా చట్టబద్ధంగా ప్రవర్తించాలని సూచించారు. ఈ అవగాహన కార్యక్రమంలో సీఐలు ఆదిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, ఎస్‌ఐలు సైదాబాబు, షరీఫ్‌లతో పాటు జిల్లాలోని పలువురు ట్రాన్స్‌జెండర్లు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>