కలం, వెబ్ డెస్క్: చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ (Xi Jinping) ఏడేళ్ల తరువాత తొలిసారి భారత్ పర్యటనకు రాబోతున్నారు. సెప్టెంబర్ 12న ఢిల్లీలో జరిగే బ్రిక్స్ సదస్సులో పాల్గొనబోతున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉంది. 2020లో జరిగిన గల్వాన్ ఘర్షణల తరువాత జిన్ పింగ్ భారత్‌కు రావడమే కాకుండా.. మోదీతో ముఖాముఖి చర్చలు జరపడం కూడా ఇదే తొలిసారి కాబోతుంది. దీంతో ఎలాంటి ఒప్పందాలు కుదురుతాయోనని సర్వత్రా చర్చ జరుగుతోంది.
చైనాకు పలుమార్లు పర్యటనలు..
గల్వాన్ ఘర్షణలు అనంతరం భారత్–చైనా సంబంధాలు చాలా వరకు క్షీణించాయి. సరిహద్దుల్లో కేవలం కమాండర్ల స్థాయి చర్చలు మాత్రమే జరుగుతూ వస్తున్నాయి. అయితే గత ఏడాది కాలంలో విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పలుమార్లు చైనాలో పర్యటించి చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే జిన్ పింగ్ భారత్ వస్తుండటం ఆసక్తికరంగా మారింది. పర్యటనకు సంబంధించి ఇంకా పూర్తి స్థాయి షెడ్యూల్ మాత్రం విడుదల కాలేదు.

