కలం, వెబ్ డెస్క్ : జనసేన నేత, శాసనమండలి సభ్యుడు నాగబాబుకు(Nagababu) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేబినెట్ హోదా (Cabinet rank)కల్పించింది. పర్యావరణ, అటవీ శాఖ పరిధిలోని ‘ఏపీ-గ్రీన్’ (AP-GREEN) ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా ఆయనను రెండేళ్ల కాలానికి నియమిస్తూ గతంలో ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.. తాజాగా కేబినెట్ ర్యాంక్‌తో పాటు వేతన, భత్యాలను ఖరారు చేస్తూ అధికారిక జీవో విడుదల చేసింది. సాధారణ పరిపాలన శాఖ ద్వారా ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి.
పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచే వర్తింపు
ఆర్థిక శాఖ సమ్మతితో జారీ చేసిన జీవో ప్రకారం నాగబాబు పదవీ బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి కేబినెట్ స్థాయి వేతన, భత్యాలు అందుకోనున్నారు. కమిటీ చైర్మన్‌గా ఆయనకు కల్పించిన హోదాకు అనుగుణంగా ప్రభుత్వం ఈ సదుపాయాలను నిర్దేశించింది. దీంతో నాగబాబు రాజకీయ పదవితో పాటు ప్రభుత్వ కీలక పర్యావరణ కార్యక్రమంలో ముఖ్య బాధ్యతలు నిర్వహించనున్నారు.
50 శాతం పచ్చదనం లక్ష్యంగా ఏపీ-గ్రీన్
పర్యావరణ పరిరక్షణ, అటవీ విస్తరణతో పాటు రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా ఏపీ-గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ పనిచేయనుంది. ‘వికసిత్ ఆంధ్రప్రదేశ్-2047’ విజన్‌లో భాగంగా రాష్ట్రంలో 50 శాతం పచ్చదనం సాధించడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించింది. ఇందులో భాగంగా అటవీకరణ, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన కార్యక్రమాలను సమన్వయం చేయనున్నారు.
జిల్లాల వారీగా కార్యక్రమాల పర్యవేక్షణ
ఏపీ-గ్రీన్ కమిటీ కార్యకలాపాలను మరింత వేగవంతం చేయడంతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయాన్ని పెంచేందుకు నాగబాబు నియామకం కీలకంగా మారనుంది. జిల్లాల వారీగా చేపట్టే హరిత కార్యక్రమాల అమలు, పర్యవేక్షణపై కమిటీ దృష్టి సారించనుంది. రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన కార్యక్రమాలను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లడమే ఈ నిర్ణయం ఉద్దేశమని ప్రభుత్వం స్పష్టం చేసింది.

