కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల ( SP Janaki Sharmila) బుధవారం నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో నమోదైన నేరాలు, పెండింగ్ కేసులు, శాంతిభద్రతలు, పోలీస్ స్టేషన్ల పనితీరుపై అధికారులతో సమీక్షించారు. నేరాల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలని, పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. కేసుల వివరాలను సీసీటీఎన్ఎస్ లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని, రౌడీషీటర్లు, అనుమానాస్పద వ్యక్తులపై నిరంతర నిఘా ఉంచాలని సూచించారు. దొంగతనాల నివారణకు రాత్రి సమయంలో గస్తీ, సీసీ కెమెరాలు, సాంకేతిక నిఘాను పటిష్టం చేయాలని తెలిపారు. సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, డ్రంక్ అండ్ డ్రైవ్, నకిలీ నెంబర్ ప్లేట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
మరోవైపు గణేష్ ఉత్సవాల నేపథ్యంలో మండపాల వివరాలను నిర్వాహకులు ముందస్తుగా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని ఎస్పీ జానకి షర్మిల సూచించారు. మండపాలు, ఊరేగింపు మార్గాలు, నిమజ్జన ఏర్పాట్లపై సమగ్ర భద్రతా ప్రణాళిక రూపొందించాలని, ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో భైంసా ఏఎస్పీ సాయి కిరణ్, నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్, సీఐలు, ఎస్హెచ్ఓలు, సిబ్బంది పాల్గొన్నారు.

