కలం, ఖమ్మం బ్యూరో: పొలం పనులకు వెళ్తున్న కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో (Tractor Accident) 15 మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ (Palvancha) మండల పరిధిలోని సత్యనారాయణపురం–ముందేరికలపాడు గ్రామాల సరిహద్దుల్లో చోటుచేసుకుంది. పొలం పనుల కోసం కూలీలను ట్రాక్టర్‌లో తరలిస్తుండగా డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా వాహనం అదుపుతప్పి బోల్తా పడినట్లు సమాచారం. ప్రమాదంలో ట్రాక్టర్‌లో ఉన్న 15 మంది కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను పాల్వంచ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
విషయం తెలుసుకున్న భారత కమ్యూనిస్టు పార్టీ (CPI) నాయకులు ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, పార్టీ తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా సిపిఐ పాల్వంచ మండల కార్యదర్శి వీసంశెట్టి పూర్ణచంద్రరావు, జిల్లా సమితి సభ్యుడు నిమ్మల రాంబాబు మాట్లాడుతూ.. దినసరి కూలీపై ఆధారపడి జీవించే నిరుపేద కుటుంబాలు ఈ ప్రమాదంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రమాదంలో గాయపడిన ప్రతి కూలీ కుటుంబానికి రూ.30 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. చేతులు విరగడం, తలకు తీవ్ర గాయాలు కావడం వంటి తీవ్ర గాయాలైన బాధితులకు రూ.50 వేల చొప్పున అదనపు పరిహారం అందించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

