కలం, మెదక్ బ్యూరో: మెదక్ జిల్లా శివ్వంపేట మండలానికి సమీపంలోని బ్రాహ్మణపల్లి (Brahmanapalli) రైల్వే గేట్ వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని మెదక్ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ్ను కోరారు. అలాగే అక్కన్నపేట రైల్వే స్టేషన్లో అజంతా ఎక్స్ప్రెస్కు హాల్ట్ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు (MP Raghunandan Rao) మాట్లాడుతూ.. నర్సాపూర్–తూప్రాన్ రైల్వే మార్గంలోని బ్రాహ్మణపల్లి రైల్వే గేట్ కారణంగా నర్సాపూర్, గజ్వేల్ నియోజకవర్గాల ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రజల సమస్యను దృష్టిలో ఉంచుకుని అక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జితో పాటు రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరినట్లు చెప్పారు.
ఈ సమస్యపై రైల్వే జీఎం సానుకూలంగా స్పందించారని ఎంపీ తెలిపారు. త్వరలోనే సమస్యను పరిశీలించి బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా 10 రోజుల్లోగా డీపీఆర్ (DPR) పూర్తి చేసి బ్రిడ్జిల మంజూరుకు చర్యలు తీసుకుంటామని జీఎం హామీ ఇచ్చినట్లు రఘునందన్ రావు వెల్లడించారు.

