నల్గొండ బస్‌స్టాండ్‌కు మోక్షం.. రూ. 54 కోట్లతో నూతన హంగులు

కలం, నల్లగొండ: నల్లగొండ పట్టణ ప్రజల దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. ఆర్టీసీ బస్‌స్టాండ్‌ (Nalgonda Bus Stand)ను అత్యాధునిక వసతులతో పునర్నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక చొరవతో నూతన బస్టాండ్‌ నిర్మాణానికి మార్గం సుగమమైంది. పన్నులు మినహాయించి సుమారు రూ. 54 కోట్ల నిధులను ఈ ప్రాజెక్టుకు మంజూరు చేశారు. నల్గొండ కార్పొరేషన్ అభివృద్ధిలో మరో మైలురాయిగా నిలవనున్న ఈ బస్‌స్టాండ్‌ను ‘నా భూతో నా భవిష్యత్తు’ అనే రీతిలో ఆకర్షణీయమైన డిజైన్లతో తీర్చిదిద్దనున్నారు.

సకల సౌకర్యాలతో నూతన భవనం..

ప్రయాణికులకు సకల సౌకర్యాలు అందుబాటులో ఉండేలా మొత్తం 49,280 చదరపు అడుగుల బిల్ట్‌అప్ ఏరియాలో ఈ నూతన భవనాన్ని నిర్మించనున్నారు. అంతేకాకుండా, వాహనాల రద్దీని నివారించేందుకు వీలుగా 32,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ బేస్‌మెంట్ పార్కింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. నూతన బస్‌స్టాండ్ ఏర్పాటుతో ప్రయాణికులకు మెరుగైన సేవలందడమే కాకుండా, నల్గొండ నగరం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మంత్రికి మేయర్ కృతజ్ఞతలు..

కార్పొరేషన్‌గా మారిన నల్గొండలో అత్యాధునిక హంగులతో బస్‌స్టాండ్ రూపుదిద్దుకోనుండటం నగర ముఖచిత్రాన్నే మార్చనుంది. నల్గొండ బస్‌స్టాండ్‌ నూతన నిర్మాణానికి నిధులు మంజూరు చేయించడమే కాకుండా, పనులను వేగవంతం చేసేందుకు చొరవ చూపిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి నల్గొండ నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఆధునిక బస్‌స్టాండ్ నిర్మాణంతో ప్రయాణికుల కష్టాలు తీరనున్నాయని, నల్గొండ ప్రగతిలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>