ఫీజు రీయింబర్స్‌మెంట్, నిరుద్యోగ భృతిపై బీఆర్ఎస్ పోరుబాట

కలం, నాగర్ కర్నూల్: విద్యార్థులకు, నిరుద్యోగ యువకులకు ఇచ్చిన హామీలను నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో బొంద పెట్టాలని, గద్దె దించాలని.. అప్పటివరకు విరామం లేకుండా పోరాటం చేయాలని నాగర్ కర్నూల్ (Nagarkurnool) మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి (Marri Janardhan Reddy) టీఆర్ఎస్వీ యూత్ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ (Gellu Srinivas Yadav) పిలుపునిచ్చారు.

బుధవారం వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనను నిరసిస్తూ నిరుద్యోగ, విద్యార్థి గర్జన పేరుతో నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పాత మార్కెట్ యార్డ్ నుండి అంబేద్కర్ చౌరస్తా వద్దకు నిరుద్యోగులు, విద్యార్థులు భారీ ప్రదర్శన ర్యాలీ (BRS Protest) నిర్వహించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని, ఇచ్చిన హామీలను అమలు చేయాలని నినాదాలు చేస్తూ అంబేద్కర్ చౌరస్తా వద్దకు చేరుకొని ధర్నా నిర్వహించారు.

కాంగ్రెస్ ప్రభుత్వంపై మర్రి జనార్దన్ రెడ్డి విమర్శలు

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ప్రభుత్వం పై రేవంత్ రెడ్డి పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి అన్నదమ్ములు లక్ష కోట్లు సంపాదించారని, మూసీ ప్రక్షాళన పేరుతో కమిషన్లు దండుకుంటూ 12 వేల కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా లేరని, ఇందులో కమిషన్ రాదని ఉద్దేశంతో చేస్తున్నారని ఆరోపించారు. విద్యార్థులకు హామీ ఇచ్చిన స్కూటీలు ఇవ్వలేదని, ఫీజు రీయింబర్స్‌మెంట్ వేయలేదని, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించలేదని, మెగా డీఎస్సీ వేయలేదని, అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేసి గొంతు నొక్కుతున్నారని ఆరోపించారు.

ఒక ఎమ్మెల్యే కేసీఆర్ చచ్చిపోవాలని మాట్లాడుతున్నాడని, ఎందుకు చచ్చిపోవాలి, యూరియా ఇవ్వని ఎమ్మెల్యేలు చావాలని, నిరుద్యోగ భృతి ఇవ్వని కాంగ్రెస్ MLA లు చావాలని శాపనార్థాలు పెట్టారు. చావు బ్రతుకులు అనేవి దేవుడు నిర్ణయిస్తాడని అన్నారు. కాంగ్రెస్‌ను ప్రజలు బొంద పెడతారని, వచ్చే ఎన్నికల్లో విద్యార్థులు, నిరుద్యోగులు తమ తల్లిదండ్రులకు చెప్పి కాంగ్రెసుకు ఓటు వేయకుండా బీఆర్ఎస్‌​కు ఓటు వేసి గెలిపించాలని, కేసీఆర్‌ను సీఎంను చేయాలని పిలుపునిచ్చారు.

డీఎస్పీ ఎమ్మెల్యే ఇంట్లో బట్టలు ఉతుకు…!

నాగర్ కర్నూల్ డీఎస్పీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. డీఎస్పీ రాజీనామా చేసి ఎమ్మెల్యే దగ్గర పీఏగా చేరాలని, ఇంట్లో బట్టలు ఉతకాలని తీవ్రంగా విమర్శించారు. విద్యార్థులు ధర్నాకు రాకుండా కళాశాలలకు, యాజమాన్యాలకు ఫోన్ చేసి విద్యార్థులను పంపించవద్దని డీఎస్పీ చెప్పడమేంటని ప్రశ్నించారు. పోలీసులు జాగ్రత్తగా వ్యవహరించాలని లేదంటే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

నువ్వేమైనా రేవంత్ రెడ్డి పంపించిన హిట్లేర్ వా, ఇలాంటి ఒకరో ఇద్దరో బేకార్ గాళ్ళ వల్ల ఇలా జరుగుతుందని, అలాంటోళ్లు ఇక్కడ ముగ్గురు ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పోలీసోళ్ళను పైకి పోతే తప్ప భూమి మీద ఎక్కడ ఉన్నా వదలమన్నారు. రైతులకు యూరియా ఇవ్వాలని అడిగితే నాపై కేసులు పెట్టారని, మీకు దమ్ముంటే అరెస్టు చేయాలని సవాల్ చేశారు. ఎన్ని కేసులు అయినా పెట్టండి భయపడేది లేదని చెప్పారు. మా ప్రభుత్వం వస్తుంది, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, తెలంగాణలో ఎక్కడ ఉన్న వదిలిపెట్టేది లేదని పోలీసులను హెచ్చరించారు.

హామీల అమలుకు పోరాటం కొనసాగిస్తాం

బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి కేవలం 15 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని, పెండింగ్​‌లో ఉన్న 70వేల ఉద్యోగాలు ఇచ్చి తామే ఇచ్చామని చెప్పుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అరాచకాలను దౌర్జన్యాలను అడ్డుకోవాలని, దీనికోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. విద్యార్థులకు ఇచ్చిన ఐదు లక్షల విద్యానిధి ఎక్కడ అని ప్రశ్నించారు.

బీసీలకు ఉచితంగా ఫీజు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని, కమిషన్ల కోసం నిధులు విడుదల చేయడం లేదని ఆరోపించారు. అవినీతి పూర్తిగా పెరిగిపోయిందని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని పిలుపునిచ్చారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉద్యోగాలు ఇచ్చేంత వరకు పోరాటం చేయాలని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. ర్యాలీ, ధర్నాలో బీఆర్ఎస్వీ విభాగం రాష్ట్ర నాయకులు విష్ణు సాగర్, విద్యార్థులు భారీ ఎత్తున పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>