కలం, మహబూబ్ నగర్ బ్యూరో : ఈ నెల 12వ తేదీ శనివారం నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను (National Lok Adalat) ప్రజలు సద్వినియోగం చేసుకుని, రాజీ పడదగిన కేసులను పరస్పర అంగీకారంతో త్వరితగతిన పరిష్కరించుకోవాలని మహబూబ్నగర్ (Mahabubnagar)జిల్లా ఎస్పీ జానకి (SP Janaki)సూచించారు. బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆమె తెలిపారు. కోర్టుల్లో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న రాజీ పడదగిన వివాదాలను ఇరుపక్షాలు పరస్పర అవగాహనతో పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ ఒక మంచి అవకాశమని తెలిపారు. దీనివల్ల సమయం, ధనం ఆదా కావడంతో పాటు మానసిక ఒత్తిడి తగ్గి, ఇరువర్గాల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుందని పేర్కొన్నారు.
పలు రకాల కేసులకు పరిష్కారం
లోక్ అదాలత్లో క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదాలు, ఆస్తి వివాదాలు, కుటుంబ, వైవాహిక వివాదాలు, బ్యాంకు రికవరీ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, విద్యుత్ చౌర్యానికి సంబంధించిన కేసులు, సైబర్ సంబంధిత రాజీ పడదగిన కేసులు తదితర కేసులను చట్టపరమైన నిబంధనల మేరకు పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని ఎస్పీ తెలిపారు. చిన్నచిన్న వివాదాలను పెద్దవిగా మార్చుకుని కక్షలు పెంచుకోవడం వల్ల ఇరువర్గాల వారు సమయం, డబ్బు కోల్పోవడంతో పాటు మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారని అన్నారు. అందువల్ల పరస్పర చర్చలు, అవగాహన, రాజీ ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడం ద్వారా ప్రశాంతమైన వాతావరణాన్ని కొనసాగించవచ్చని సూచించారు.
రాజీతో సమస్యలకు సామరస్య పరిష్కారం
“రాజీ మార్గమే రాజమార్గం” అనే విషయాన్ని ప్రజలు గుర్తించి, న్యాయశాఖ అందిస్తున్న జాతీయ లోక్ అదాలత్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమకు సంబంధించిన రాజీ పడదగిన కేసులను త్వరితగతిన పరిష్కరించుకోవాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. జిల్లాలోని పోలీస్ అధికారులు, కోర్టు విధులు నిర్వహించే పోలీస్ సిబ్బంది రాజీ పడదగిన కేసులను గుర్తించి, సంబంధిత ఇరువర్గాల వారిని సంప్రదించి అవసరమైన అవగాహన, కౌన్సిలింగ్ కల్పిస్తూ లోక్ అదాలత్ ద్వారా కేసుల పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు. తమ కేసులను రాజీ ద్వారా పరిష్కరించుకోవాలనుకునే వారు సంబంధిత పోలీస్ అధికారులు లేదా కోర్టు విధులు నిర్వహించే పోలీస్ సిబ్బందిని సంప్రదించాలని ఎస్పీ సూచించారు.
పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన
లోక్ అదాలత్ ద్వారా కేసులు త్వరితగతిన పరిష్కారం కావడంతో బాధితులకు ఉపశమనం లభించడంతో పాటు, ఇరువర్గాల మధ్య ఉన్న వివాదాలకు సామరస్యపూర్వక పరిష్కారం లభిస్తుందని ఎస్పీ తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాజీ పడదగిన కేసులను రాజీ మార్గంలో పరిష్కరించుకుని ప్రశాంతమైన, స్నేహపూర్వక జీవితాన్ని కొనసాగించాలని ఎస్పీ జానకి కోరారు.

