కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. విపక్షాలకు అస్త్రంగా ‘రిమాండ్ రిజెక్షన్లు’!

కలం, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కోర్టుల్లో జ్యుడీషియల్ రిమాండ్‌లు రిజెక్టు (Remand Rejections) కావడం ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నది. ఇది ప్రతిపక్షాలకు రాజకీయ అస్త్రంగా మారుతున్నది. “ప్రజాస్వామ్యం గెలిచింది.. న్యాయం లభించింది.. కాంగ్రెస్ అక్రమ అరెస్టులకు చెక్ పడింది.. పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరించకుండా, కోర్టులతో అక్షింతలు వేయించుకుంటున్నారు..” అంటూ బీఆర్ఎస్ తరచూ ఇలాంటి సంఘటనల సమయంలో ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని విమర్శిస్తున్నది.

హోంశాఖను కూడా ముఖ్యమంత్రే నిర్వహిస్తుండడంతో నేరుగా ఆయనపైనే బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తున్నది. రిమాండ్ రిపోర్టుల్లోని తప్పులను, లోపాలను కోర్టులు ప్రస్తావించి జ్యుడీషియల్ కస్టడీని రిజెక్టు చేస్తున్నాయి. గతంలో తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్, బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు గెల్లు శ్రీనివాస యాదవ్ తదితరుల విషయంలో ఇదే జరిగింది.

అసమగ్ర రిపోర్టులతో రిజెక్ట్

ప్రభుత్వం ఒత్తిడి చేస్తున్నందునే పోలీసులు రిమాండ్ రిపోర్టులో సరైన వివరాలు పొందుపర్చలేకపోతున్నారని, సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ కు విరుద్ధంగా అరెస్టులు జరుగుతున్నాయంటూ కోర్టులు వేర్వేరు సందర్భాల్లో పోలీసుల తీరును తప్పుపట్టాయి. అరెస్టయిన తర్వాత రిమాండ్ రిపోర్టును స్టడీ చేసే కోర్టులు రిమాండ్ విధించడానికి నిరాకరించి సొంత పూచీకత్తుపై విడుదల చేస్తున్నాయి. పోలీస్ ఆఫీసర్ల అసమగ్రమైన రిపోర్టులే ‘రిమాండ్ రిజెక్ట్’(Remand Rejections)కు కారణాలవుతున్నాయి.

బీఆర్ఎస్ దీన్ని రాజకీయంగా అనుకూలంగా మల్చుకుంటున్నది. తాజాగా ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డి విషయంలోనూ నాంపల్లి కోర్టు రిమాండ్ రిజెక్ట్ చేయడం ఊహించని పరిణామంగా మారింది. సొంత పూచీకత్తుపై విడుదల కాగానే ‘‘న్యాయం గెలిచింది.. కాంగ్రెస్ రాజకీయ ప్రతీకార చర్యలకు కోర్టు నిర్ణయం చెంపపెట్టు..’’ లాంటి కామెంట్లు బీఆర్ఎస్ నేతల నుంచి వచ్చాయి.

గుణపాఠం నేర్వని పోలీస్ శాఖ

గతంలోని తప్పుల నుంచి పోలీసులు గుణపాఠం నేర్వలేదని, చివరకు అది ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నదనే ఆవేదన సైతం కొద్దిమంది ఆఫీసర్లలో లేకపోలేదు. కొన్నిసార్లు కోర్టులు రిమాండ్ విధించినా ఆ తర్వాత హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలైన సందర్భంగా విచారణలో పోలీసులపై కోర్టు అక్షింతలు వేస్తున్నది. కొణతం దిలీప్‌ను తొలుత 2024 నవంబరులో సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కోసం కోర్టుకు వెళ్లగా రిపోర్టును తిరస్కరించి విడుదల చేసింది

ఆ తర్వాత 2025 జూలైలో అమెరికా నుంచి రాగానే శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకుని నిర్మల్ కోర్టులో హాజరుపరచగా అక్కడ కూడా రిమాండ్ రిపోర్టును తోసిపుచ్చి రిలీజ్ చేసింది. మూడోసారి ఈ ఏడాది మార్చిలో ఆయనపై పోలీసులు నమోదు చేసిన మూడు ఎఫ్ఐఆర్‌లను హైకోర్టు కొట్టివేసింది. పోలీసులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని కోర్టు వ్యాఖ్యానించింది. బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్‌ను యూనివర్శిటీ హాస్టళ్ల మూసివేతపై నకిలీ ఉత్తర్వులను సర్క్యులేట్ చేశారనే ఆరోపణపై పోలీసులు అరెస్టు చేయగా 41 సీఆర్పీసీ నిబంధనలు పాటించలేదన్న కారణాన్ని, ప్రాథమిక ఆధారాలు చూపలేకపోయిందని పేర్కొని విడుదల చేసింది.

కీలకంగా ఏడేండ్ల జైలుశిక్ష నిబంధన

విద్యార్థి నిరసనల సందర్భంగా బీర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ అరెస్టు విషయంలోనూ నాంపల్లి కోర్టు రిమాండ్‌ను రిజెక్ట్ చేసింది. ఏడేండ్ల కంటే తక్కువ శిక్ష పడే కేసుల్లో ముందస్తు నోటీసులు ఇవ్వాలనే సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కోర్టులు ప్రస్తావిస్తున్నాయి. అర్ధరాత్రి, తెల్లవారుజాము అరెస్టులకు ముందస్తు నోటీసులు ఇవ్వకపోవడాన్ని తప్పు పట్టి రిమాండ్‌ను రిజెక్టు చేస్తున్నట్లు బీఆర్ఎస్ న్యాయవాదులు పలు సందర్భాల్లో పేర్కొన్నారు.

పోలీసులు సేకరించిన సాక్ష్యాధారాలకంటే రాజకీయ ఒత్తిళ్లతో కోర్టుకు తెస్తున్నారని, చట్టబద్ధమైన కారణాలు రిమాండ్ రిపోర్టులో కనిపించడం లేదని మేజిస్ట్రేట్‌లు ప్రస్తావిస్తున్నారు. ఒకే ఘటనకు సంబంధించి వేర్వేరు పోలీసు స్టేషన్లలో ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసి అరెస్టు చేయడాన్ని కూడా తప్పుపడుతున్నారు. పదేపదే రిమాండ్ రిపోర్టులను కోర్టులు తిరస్కరిస్తున్నా పోలీస్ ఆఫీసర్లు గుణపాఠం నేర్చుకోవడం లేదనే చర్చ సచివాలయ వర్గాల్లోనే కాక కాంగ్రెస్ పార్టీలోనూ జరుగుతున్నది.

Also Read : 15 టన్నుల దిగుబడి.. రూ.3,45,000 ఆదాయం

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>