కలం, కరీంనగర్: ఈ నెల 14 నుంచి ప్రారంభమయ్యే గణేష్ నవరాత్రి ఉత్సవాల నుంచి నిమజ్జనం వరకు ప్రతి అంశాన్ని పక్కా ప్రణాళికతో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా (Karimnagar Collector) అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన పీస్ కమిటీ సమావేశంలో పోలీస్ కమిషనర్ గౌష్ ఆలమ్‌తో కలిసి కలెక్టర్ ఉత్సవాలు, నిమజ్జన ఏర్పాట్లపై సమీక్షించారు. కరీంనగర్ నగరపాలక సంస్థతో పాటు హుజురాబాద్, చొప్పదండి, జమ్మికుంట మున్సిపాలిటీల్లో చేపడుతున్న ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు.
ముందస్తు ప్రణాళికే.. విజయానికి బాట
ప్రతి ఏడాది జిల్లాలో గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించుకుం టున్నామని, అదే సంప్రదాయాన్ని ఈసారి కూడా కొనసాగించాలని కలెక్టర్ సూచించారు. వినాయక చవితి నుంచి నిమజ్జనం వరకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా చూడాలని ఆదేశించారు. గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు ప్రతి గణేష్ మండపం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు ట్రాఫిక్ నియంత్రణ, విద్యుత్ సరఫరా, నిమజ్జన పాయింట్ల వద్ద భద్రత, తాగునీరు, లైటింగ్, పారిశుధ్యం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
నిమజ్జన పాయింట్ల వద్ద ‘పక్కా’ ఏర్పాట్లు
జిల్లాలోని ప్రతి నిమజ్జన పాయింట్ వద్ద అవసరమైన మేరకు బ్యారికేడ్లు, క్రేన్లు, లైటింగ్, విద్యుత్, తాగునీరు వంటి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి పాయింట్ వద్ద మెడికల్ క్యాంపు, 108 వాహనం అందుబాటులో ఉంచాలని సూచించారు. అవసరమైన చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్ నుంచి నిరంతరం పర్యవేక్షించాలని అన్నారు. క్రేన్లకు అదనపు డ్రైవర్లు, మెకానిక్‌లను సిద్ధంగా ఉంచాలని, నిమజ్జనం రోజున ఉదయం 6 గంటలకే క్రేన్లు సిద్ధంగా ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నిమజ్జన పాయింట్ల వద్ద అవసరమైన సంఖ్యలో గజ ఈతగాళ్లను షిఫ్టుల వారీగా నియమించాలని కలెక్టర్ సూచించారు. స్విమ్మర్లతో ముందుగానే మాట్లాడి విధుల వివరాలు తెలియజేయాలని ఆదేశించారు.
పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి
గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో పారిశుధ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ స్పష్టం చేశారు. నిమజ్జన పాయింట్ల వద్ద షిఫ్టుల వారీగా పారిశుధ్య సిబ్బందిని నియమించి నిరంతరం పరిశుభ్రత ఉండేలా చూడాలని ఆదేశించారు. ఉత్సవ కమిటీలు కూడా పారిశుధ్య నిర్వహణలో పూర్తి సహకారం అందించాలని కోరారు. విగ్రహాల తరలింపు సమయంలో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. మండపాల వద్ద షార్ట్‌సర్క్యూట్‌కు అవకాశం లేకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
కరీంనగర్ లో నగరపాలక సంస్థ అధికారులు రోడ్ల మరమ్మత్తు చేపట్టాలని ఆకట్టుకునే విధంగా లైటింగ్ ఏర్పాటు చేయాలని లూజు వైరింగ్ సరిచేయాలని చెట్లు ఎక్కడ అడ్డు రాకుండా చూడాలని ఇతర జాగ్రత్తలు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రభుత్వం ప్రతి గణేష్ మండపానికి ఉచిత విద్యుత్ కనెక్షన్ అందిస్తుందని, లైన్‌మెన్ ద్వారా కనెక్షన్లు ఏర్పాటు చేస్తారని తెలిపారు. ప్రజలు స్వయంగా విద్యుత్ కనెక్షన్లు తీసుకుని ప్రమాదాలకు గురికావద్దని సూచించారు.
రూట్ మ్యాప్ ముందే ఫైనల్ చేయాలి
సెప్టెంబర్ 23న ప్రధాన నిమజ్జన కార్యక్రమాలు జరగనున్న నేపథ్యంలో విగ్రహాల ఊరేగింపు రూట్ మ్యాప్‌ను ముందుగానే ఖరారు చేయాలని కలెక్టర్ సూచించారు. నిమజ్జన మార్గాల్లో రోడ్డు మరమ్మతులు వెంటనే పూర్తి చేయడంతో పాటు అప్రోచ్ రోడ్లను సక్రమంగా ఉంచాలని ఆదేశించారు. విగ్రహాల తరలింపునకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలు తొలగించాలని సూచించారు.
ఎత్తైన విగ్రహాల తరలింపును ప్రత్యేకంగా పర్యవేక్షించాలని అన్నారు. ప్రతి వినాయక మండపం తప్పనిసరిగా రిజిస్టర్ కావాలని కలెక్టర్ తెలిపారు. మండపాల వద్ద పోలీస్, ఫైర్, విద్యుత్, వైద్య తదితర అత్యవసర సేవల కాంటాక్ట్ నంబర్లతో కూడిన పోస్టర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. నిమజ్జనం సందర్భంగా మద్యం విక్రయాలకు అవకాశం లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
గణేష్ మండపాల సమీపంలో బెల్ట్ షాపులు ఉంటే మద్యం విక్రయాలను నియంత్రించాలని, అలాంటి షాపుల సమాచారాన్ని ఎక్సైజ్ అధికారులు వెంటనే పోలీసులకు అందించాలని సూచించారు. పోలీస్ తో పాటు అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉంటూ సమన్వయంతో విధులు నిర్వర్తించాలని ప్రశాంతంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకునేలా చూడాలన్నారు.
పోలీసుల నిఘా.. కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షణ
పోలీస్ కమిషనర్ గౌష్ ఆలమ్ మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ తరఫున పకడ్బందీ బందోబస్తు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కరీంనగర్ నగరంలోని వినాయక విగ్రహాలను మానకొండూరు, కొత్తపల్లి, చింతకుంట ప్రాంతాల్లో నిమజ్జనం చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లో అవసరమైన ఏర్పాట్లు చేపడుతున్నామని తెలిపారు. ప్రతి మండపం వద్ద నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని, పోలీసులకు పూర్తిగా సహకరించాలని కోరారు.
హెడ్‌క్వార్టర్స్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్
పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో పోలీస్ శాఖతో పాటు విద్యుత్, మున్సిపల్, వైద్య, ఇతర శాఖల అధికారులతో కలిసి ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్లు సీపీ తెలిపారు. మండపాలు, నిమజ్జన ప్రాంతాల్లో ఏదైనా సమస్య తలెత్తితే కంట్రోల్ రూమ్ ద్వారా సమాచారం అందుకుని వెంటనే స్పందించేలా వ్యవస్థను సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. విగ్రహాల తరలింపు వాహనాలను ముందుగానే బుక్ చేసుకోవడంతో పాటు రూట్ మ్యాప్‌ను ముందుగానే ఫైనల్ చేసుకోవాలని తెలిపారు. మున్సిపల్ అధికారులు, ఉత్సవ కమిటీలు, పోలీస్ అధికారులు సమన్వయంతో నిమజ్జన రూట్‌ను ఖరారు చేయాలని సూచించారు.
గణేష్ ఉత్సవ సమితి, పీస్ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ.. రేకుర్తి సమీపంలో నిమజ్జనానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని కోరారు. నిమజ్జనానికి వారం రోజుల ముందే రోడ్ల మరమ్మతులు, లైటింగ్, చెట్ల కొమ్మల తొలగింపు వంటి పనులు పూర్తి చేయాలని సూచించారు.విక్రేన్లు, గజ ఈతగాళ్లు, బోట్లు ముందుగానే సిద్ధంగా ఉంచాలని కోరారు. జిల్లా యంత్రాంగానికి పూర్తి సహకారం అందించి గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా, వైభవంగా నిర్వహించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ శ్రీనివాస్ రెడ్డి, డీఆర్వో స్వామి, ఆర్డీవోలు షర్మిల, జలకుమారి, ఏసీపీలు వెంకటస్వామి, విజయ్‌కుమార్, యాదగిరిస్వామి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రాజగోపాల్‌రావు, డీపీవో జగదీశ్వర్, జిల్లా మత్స్యశాఖ అధికారి విజయభారతి, గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు కే. మహేశ్వర్, రాధాకృష్ణారెడ్డి, జిల్లా అధికారులు, పుర ప్రముఖులు, పీస్ కమిటీ సభ్యులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

