కలం, మెదక్ బ్యూరో: ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్‌కు వెళ్తున్న కేటీఆర్ (KTR), హరీశ్ రావు సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మేడ్చల్ జిల్లా హకీంపేట వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. ఎర్రవల్లి వెళ్లేందుకు అనుమతి నిరాకరించడంతో పోలీసులతో కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి గొడవకు దిగారు. ఎమ్మెల్యేలు కార్లు దిగి కాలినడకనే ఎర్రవల్లి వెళ్లేందుకు బయల్దేరారు.
ఈ క్రమంలోనే మేడ్చల్ మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్ సుమతి అక్కడకు చేరుకుని కేటీఆర్, ఇతర ఎమ్మెల్యేలను మరోసారి అడ్డుకోవడంతో రోడ్డుపైనే బైఠాయించారు. దీంతో కేటీఆర్ సహా అందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసి సమీపంలోని పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. కేటీఆర్‌ను బోయినపల్లి, హరీశ్ రావును జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. అరెస్టులకు నిరసనగా హకీంపేటలో పార్టీ శ్రేణులు ఆందోళకు దిగారు.
కేసీఆర్‌ను చంపే కుట్ర: కేటీఆర్
సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా గూండాలను కేసీఆర్ ఇంటి మీదకు పంపించి, ఆయన్ను చంపే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. తమ నాయకుడికి పోలీసులు రక్షణ ఇవ్వలేరని.. ఆయన్ను రక్షించుకునేందుకు తాము వెళ్తుంటే 50 కిలోమీటర్ల దూరంలో ఆపేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే కేసీఆర్ ఇంటిపై దాడి జరుగుతోందన్నారు. ఇది అత్యంత దుర్మార్గమన్నారు.

