కలం, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ స్పీకర్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు (Tata Madhu) చేసిన అనుచిత వ్యాఖ్యలకు శాసనమండలి ఛైర్మన్ చర్యలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆయనపై అనర్హత వేటు వేస్తూ.. సభ్యత్వాన్ని రద్దు చేయాలన్న డిమాండ్ అసెంబ్లీలో బలంగా వినిపించడంతో ఛైర్మన్ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. అసెంబ్లీ సమావేశాల తొలి రోజు బీఆర్ఎస్ నేతలు చేపట్టిన నిరసనలో తాతా మధు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి.
సీఎం రేవంత్‌రెడ్డి, శాసన వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు అసెంబ్లీ వేదికగా చేసిన డిమాండ్ల నేపథ్యంలో మండలి ఛైర్మన్ (Council Chairman) ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు నిరసన సందర్భంగా పోలీసు అధికారులతో పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దురుసుగా వ్యవహరించిన ఘటనపైనా అసెంబ్లీ స్పీకర్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. వారిని ఈ సెషన్ మొత్తానికి సస్పెన్షన్ వేటు వేసే అవకాశం కూడా స్పీకర్ పరిశీలనలో ఉన్నది.
కేసీఆర్ క్షమాపణకు డిమాండ్..
దళిత వర్గానికి చెందిన స్పీకర్‌ను ఉద్దేశించి తాతా మధు చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా క్షమాపణ చెప్పాలని అధికారపక్షం ప్రతిపాదిస్తోంది. అసెంబ్లీ సెషన్‌కు ముందురోజు బీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశంలో ఆ పార్టీ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలకు కేసీఆర్ చేసిన దిశానిర్దేశం ఇదేనా అని ప్రశ్నిస్తోంది. పథకం ప్రకారమే ఇది జరిగిందని ఆరోపిస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి సైతం కేసీఆర్ నుంచి క్షమాపణ కోరారు.
ఆ పని చేయకపోతే నిరసనలు తప్పవని, కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఫామ్‌హౌజ్ ముందు వేలాది మందితో ‘చావు డప్పు’ తప్పదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వార్నింగ్ ఇచ్చారు. ఖమ్మం స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీగా ఉన్న తాతా మధు (Tata Madhu) పదవీకాలం 2028 జనవరి వరకు ఉంది. అటు ముఖ్యమంత్రి, ఇటు శాసన వ్యవహారాల మంత్రి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన డిమాండ్ల నేపథ్యంలో.. శాసనమండలి ఛైర్మన్ తీసుకునే నిర్ణయం పొలిటికల్‌గా చర్చనీయాంశంగా మారనున్నది.
గతంలోనూ సస్పెన్షన్లు, బహిష్కరణలు..
తెలంగాణ ఏర్పడిన తర్వాత అసెంబ్లీలో పలుమార్లు సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. 2018 మార్చిలో గవర్నర్ ప్రసంగం సందర్భంగా హెడ్‌ఫోన్స్ విసిరివేశారన్న ఆరోపణలతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌ను అసెంబ్లీ నుంచి బహిష్కరించారు. ఈ నిర్ణయంపై వారు హైకోర్టును ఆశ్రయించగా ఊరట లభించింది. అదే సమయంలో కాంగ్రెస్‌కు చెందిన 11 మంది ఎమ్మెల్యేలతోపాటు, వేర్వేరు సమావేశాల్లో టీడీపీ, బీజేపీ సభ్యులపైనా సస్పెన్షన్ వేటు పడింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఏడాది బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రెండు రోజులపాటు సస్పెండ్ చేయగా.. గతేడాది జగదీశ్‌రెడ్డిని సమావేశాలు పూర్తయ్యే వరకు సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఏకంగా అసెంబ్లీ స్పీకర్‌ను ఉద్దేశించి తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలపై సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు చర్యలు కోరడంతో.. తమ అభిప్రాయాలను మండలి ఛైర్మన్‌కు పంపిస్తానని స్పీకర్ సభాముఖంగానే వెల్లడించడం గమనార్హం.
Also Read : బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు అరెస్ట్.. కేటీఆర్ ఆగ్రహం..!
Follow Us On: X(Twitter)

