కేసీఆర్ కాదు.. రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి : కేటీఆర్

​కలం, కరీంనగర్ బ్యూరో: రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఫల్యాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విరుచుకుపడ్డారు. శనివారం కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన ‘జెన్ జీ’ (Gen-Z) సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేయడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

​డోకేబాజ్ రేవంత్ రాజీనామా చేయాలి

‘ఓటుకు నోటు’ కేసులో దొరికిన డోకేబాజ్ రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి కానీ, తెలంగాణను సాధించిన కేసీఆర్ కాదని కేటీఆర్ తెగేసి చెప్పారు. “కేసీఆర్‌తో పెట్టుకుంటే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. ఆయనను తాకే ధైర్యం కాంగ్రెస్‌కు లేదు” అంటూ సినీ డైలాగ్‌తో హెచ్చరించారు.

​యువత తిరగబడితే ఏ ప్రభుత్వమైనా ఖతమే

యువత శక్తిని తక్కువ అంచనా వేయవద్దని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేటీఆర్ హెచ్చరించారు. “జెన్ జీ యువత తిరగబడి నడుం బిగిస్తే కేంద్రంలో నరేంద్ర మోదీ అంతటివాడే దిగిరావాల్సి వచ్చింది. అలాంటిది ఈ ‘చిట్టినాయుడు’ రేవంత్ రెడ్డి మీకొక లెక్కా?” అని పేర్కొన్నారు.

మూటలతో రాహుల్ గాంధీ నోరు మూత

ఎన్నికల సమయంలో ‘యూత్ డిక్లరేషన్’ పేరిట పెద్ద మాటలు చెప్పి కాంగ్రెస్ యువతను దారుణంగా మోసం చేసిందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న రాహుల్ గాంధీ, అధికారంలోకి రాగానే హామీని పక్కనబెట్టారు. నెలకోసారి హైదరాబాద్ నుంచి స్టీల్ కవర్లలో మూటలు అందుతుండటంతోనే రాహుల్ నోరు మూసుకొని కూర్చుంటున్నారు. మీ సీఎం ఏం చేస్తున్నారో మీకు అసలు సోయి ఉందా?” అని ప్రశ్నించారు.

​కుక్కల్లా కొట్లాడుకుంటున్న మంత్రులు

రాష్ట్రంలో ప్రభుత్వ పాలన పూర్తిగా కుప్పకూలిందని, మంత్రులు, ముఖ్యమంత్రి కుర్చీల కోసం కుక్కల్లా కొట్లాడుకుంటున్నారని కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 60 ఏళ్లు తెలంగాణ ప్రజల రక్తం తాగిన ముసలి నక్క కాంగ్రెస్ పార్టీ అని దుయ్యబట్టారు. తెలంగాణ ఇస్తామని మోసం చేసి ఎందరో యువకుల ఆత్మబలిదానాలకు కారణమైన కాంగ్రెస్‌కు, ఈ రోజు ఓటేసి దండం పెట్టిన ప్రజలే రేపు రాజకీయ పిండాలు పెడతారని కేటీఆర్ (KTR) హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>