కలం, నిర్మల్: నిర్మల్(Nirmal) ఆర్టీసీ డిపోకు చెందిన బస్సులో ప్రయాణికురాలు పోగొట్టుకున్న పర్సును గుర్తించిన కండక్టర్ కళ్యాణి, డ్రైవర్ మొబిన్ నిజాయితీ చాటుకున్నారు. నిర్మల్ బస్టాండ్ నుంచి కుంటాల మండలం ఓలా గ్రామానికి బస్సు బయలుదేరింది. మార్గమధ్యంలోని దిలావర్పూర్లో ఓ ప్రయాణికురాలు బస్సు ఎక్కి ఓలా గ్రామంలో దిగిపోయారు. అనంతరం బస్సు గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత కండక్టర్ కళ్యాణి విధుల్లో భాగంగా బస్సును ముందు, వెనుక పరిశీలించారు.
ఈ క్రమంలో చివరి సీటు కింద ఓ పర్సు కనిపించింది. దానిని పరిశీలించగా అందులో రూ.5,010 నగదు, రెండు ఆధార్ కార్డులు ఉన్నట్లు గుర్తించారు. ఆధార్ కార్డులో ఉన్న ఫోన్ నంబర్ ఆధారంగా ప్రయాణికురాలిని సంప్రదించిన కండక్టర్.. ఆమెకు పర్సును సురక్షితంగా తిరిగి అప్పగించారు. నగదుతో పాటు ఆధార్ కార్డులను భద్రంగా తిరిగి అందజేసి నిజాయితీ చాటుకున్న కండక్టర్ కళ్యాణి, డ్రైవర్ మొబిన్ను డిపో మేనేజర్ పండరి అభినందించారు. ఆర్టీసీ సిబ్బంది చూపిన నిజాయితీపై పలువురు ప్రశంసలు వ్యక్తం చేశారు.

