సూర్యాపేట టీపీఓపై ఏసీబీ పంజా.. భారీగా ఆస్తుల గుర్తింపు

కలం, సూర్యాపేట: ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై సూర్యాపేట (Suryapet) మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ (Town Planning Officer) ఉయ్యాల సోమయ్యపై అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. ఏకకాలంలో ఆయన నివాసాలు, కార్యాలయంతో పాటు బంధువులు, అనుచరులకు సంబంధించిన మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. సూర్యాపేటలోని మానసనగర్, హైదరాబాద్‌లోని హయత్‌నగర్, మిర్యాలగూడలోని పలు ప్రాంతాల్లో ఏసీబీ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతుల ప్రక్రియను అడ్డం పెట్టుకుని అక్రమంగా ఆస్తులు కూడబెట్టినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా ఈ సోదాలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

రూ.3.54 కోట్ల ఆస్తులు గుర్తింపు

ఏసీబీ అధికారుల లెక్కల ప్రకారం సోదాల్లో సోమయ్యకు సంబంధించి రూ.3,54,36,490 విలువైన ఆస్తులను గుర్తించారు. ఇందులో 3 ఎకరాల 3 గుంటల వ్యవసాయ భూమి, సూర్యాపేట, హయత్‌నగర్ పరిధిలో 5 రెసిడెన్షియల్ ప్రాపర్టీలు ఉన్నట్లు గుర్తించారు. వీటిలో జీ+1, జీ+2, జీ+4+పెంట్‌హౌస్ భవనాలతో పాటు రెండు గ్రౌండ్‌ఫ్లోర్ ఇళ్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అలాగే 8 ఓపెన్ ప్లాట్లు, రూ.4.63 లక్షల నగదు, బ్యాంకు ఖాతాల్లో రూ.13 లక్షల బ్యాలెన్స్, 709 గ్రాముల బంగారం, 1,750 గ్రాముల వెండి, రెండు కార్లు, మూడు ద్విచక్ర వాహనాలను గుర్తించారు. ఇంట్లో సుమారు రూ.11 లక్షల విలువైన గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్నట్లు తెలిపారు.

రూ.49 లక్షల గోల్డ్ లోన్

బ్యాంకులో 66 తులాల బంగారం తాకట్టు పెట్టి రూ.49 లక్షల గోల్డ్ లోన్ తీసుకున్నట్లు కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. గుర్తించిన ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్‌లో మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.సోదాల సందర్భంగా కీలక పత్రాలు, నగదును స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు సోమయ్యను అరెస్ట్ చేశారు. ఆయనను హైదరాబాద్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. సోమయ్యకు సంబంధించిన ఆస్తులు, ఆదాయ వనరులపై ఏసీబీ అధికారులు మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>