కలం, జగిత్యాల: అర్హులైన వారికి స్మార్ట్ రేషన్ కార్డులను వెంటనే అందిస్తున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Adluri Laxman Kumar) అన్నారు. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల కేంద్రంలో గురువారం కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో రేషన్ కార్డులు కావాలంటే నాయకులకు దరఖాస్తులు చేసుకునేవారని విమర్శించారు.
నియోజకవర్గంలో ఇప్పటికే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణంతో పాటు ధర్మపురిలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేశామని మంత్రి గుర్తు చేశారు. వెల్గటూరులో ఐటీఐ, ఎండపల్లిలో పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు. పాసిగాం గ్రామంలో ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. పెండింగులో ఉన్న రోళ్ల వాగు ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేసి రంగదామునిపల్లి చెరువుతో పాటు జంగల్ నాలా ప్రాజెక్టు అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.
9,900 రేషన్ కార్డుల పంపిణీ..
ఎండపల్లి మండలంలో 9,900 రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ఎండపల్లి గ్రామానికి 33 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామన్నారు. గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణంతో పాటు ఎస్సీ కమిటీ హాల్ నిర్మాణం పూర్తి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఎండపల్లిలో ఎక్స్ ప్రెస్ బస్సు ఆపేలా చర్యలు తీసుకుంటామని, మండల కేంద్రంలో జూనియర్ కళాశాల ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి మారం సునీత, జగిత్యాల అడిషనల్ కలెక్టర్ లత, ఆర్డీవో మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.

