కొండా పోస్ట్ ఊస్ట్ .. AICC కీలక నిర్ణయం..!

కలం, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర మంత్రివర్గం నుంచి కొండా సురేఖ(Konda Surekha)ను బర్తరఫ్ చేయడం దాదాపు ఖరారైంది. వీలైనంత తొందరగా ఆమెను తప్పించాలని ఏఐసీసీ స్పష్టమైన నిర్ణయానికి వచ్చింది. ఈ నెల 7న ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లోనే ఆమెపై వేటు ఖాయమని ఏఐసీసీ వర్గాల సమాచారం. పార్టీ నుంచి అధికారిక ప్రకటన వెలువడిన వెంటనే ఎమ్మెల్యే పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేయాలని కొండా సురేఖ భావిస్తున్నట్లు సన్నిహితుల సమాచారః ఇప్పటికే ఆమె తన అనుచరులతో ఫోన్‌లో మాట్లాడి భవిష్యత్ కార్యాచరణపై ప్రత్యక్షంగా వారితో గురువారం వరంగల్‌లో సమావేశం కానున్నారు.

త్వరలో వరంగల్ ఈస్ట్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యం కానున్నది. మరోవైపు స్టేట్ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డిని సైతం ఆ పదవి నుంచి తప్పించాలని భావిస్తున్న తరుణంలో స్వచ్చందంగా ఆయనే రాజీనామా చేసినట్లు తెలిసింది. ఆ స్థానంలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ గద్వాల విజయలక్ష్మిని నియమిస్తూ ఉత్తర్వులు సిద్ధమయ్యాయి. విడుదల కావడమే తరువాయి.

ఏఐసీసీ హెడ్‌క్వార్టర్‌లో ఉదయం నుంచి సందడి :

కొండా సురేఖ (Konda Surekha) ఎపిసోడ్‌ను కొలిక్కి తేవడానికి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే రంగంలోకి దిగారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో ఉదయమే ఇందిరాభవన్‌లో భేటీ అయ్యారు. వారి అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాత కొండా సురేఖను పిలిపించుకుని ఆమె నుంచి వివరణ తీసుకున్నారు. ఆ భేటీ తర్వాతనే బయటకు వచ్చి మీడియా ప్రతినిధులతో మాట్లాడి నిర్ణయం కోసం వెయిట్ చేస్తున్నానంటూ వ్యాఖ్యానించారు.

అప్పటికే పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నదో ఆమె స్పష్టతకు వచ్చారు. ఈ కారణంగానే తనపైన చర్యలు తీసుకునేటట్లయితే తొలుత ముఖ్యమంత్రిపై తీసుకోవాలంటూ కామెంట్ చేశారు. ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలతోనే సుష్మిత ఫైర్ కావాల్సి వచ్చిందని సమర్ధించుకున్నారు. రెడ్డి నేతలు ఇష్టారీతిన కామెంట్లు చేసినా పట్టించుకోని క్రమశిక్షణా కమిటీ బీసీ నేతలపై చర్యలు తీసుకుంటుందని, బీసీలంతా ఏకమవుతారంటూ వ్యాఖ్యానించారు.

రాష్ట్ర నేతల మెజారిటీ అభిప్రాయం తప్పించాలనే :

రాష్ట్ర నేతల నుంచి అభిప్రాయాలను తీసుకున్న ఏఐసీసీ చీఫ్ ఆ తర్వాత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తోనూ చర్చించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా ఖర్గే పిలిపించుకుని రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, కొండా సురేఖపై తీసుకోవాల్సిన చర్యలపై వారి అభిప్రాయాలను సేకరించారు. అనంతరం రాహుల్‌గాంధీతో ఖర్గే, కేసీ భేటీ కావాల్సి ఉన్నప్పటికీ బుధవారం రాత్రం 11.30 గంటల వరకూ సమావేశం కాలేదు. దీంతో అధికారికంగా ప్రకటన గురువారం తర్వాత వచ్చే అవకాశమున్నట్లు ఏఐసీసీ వర్గాలు తెలిపాయి.

అసెంబ్లీ సమావేశాల్లోపే నిర్ణయాన్ని వెలువరించడం ఉత్తమమనే అభిప్రాయానికి ఏఐసీసీ వచ్చినట్లు తెలిసింది. కొండా సురేఖను మంత్రివర్గం తొలగించడం ద్వారా బీసీల్లో ఎలాంటి అలజడికి తావు లేకుండా మరో ముగ్గురు బీసీలకు పదవులు ఇవ్వడంపైనా కసరత్తు పూర్తయింది. ఈ మూడు పోస్టుల్నీ మహిళలకే కట్టబెట్టేలా నిర్ణయించడం గమనార్హం. కొండా సురేఖ లేవనెత్తిన బీసీ కార్డుకు ఏఐసీసీ సైతం అదే మంత్రంతో చెక్ పెడుతున్నది.

ఒకే వాహనంలో ఖర్గే, సీఎం, డిప్యూటీ :

రాష్ట్రానికి సంబంధించిన రాజకీయ అంశాలను లోతుగా చర్చించిన తర్వాత ఖర్గే కారులోనే సీఎం, డిప్యూటీ సీఎం కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో వైఎస్సార్ ఫౌండేషన్ తరఫున జరిగే కార్యక్రమానికి వెళ్ళారు. అది ముగిసిన తర్వాత మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ సైతం ఒకే కారులో బయటకు బయలుదేరారు. మంత్రి ఉత్తమ్ అరగంటకు పైగానే ఖర్గేతో సమావేశమయ్యారు. అనంతరం మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, కొండా సురేఖ వ్యవహారంలో ఏఐసీసీ ఆలోచనలు, చర్చల గురించి తనకేమీ తెలియదని, ఆ అంశంలో తాను ఇన్‌వాల్వ్ కాలేదని బదులిచ్చారు.

మంత్రివర్గం నుంచి ఆమెను తొలగిస్తున్నట్లు మీడియా ద్వారా వస్తున్న వార్తలతో తనకు ఎలాంటి సంబంధమూ లేదన్నారు. అది పార్టీకి, ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారం కాబట్టి ఆ విభాగాల పెద్దలనే అడగాలన్నారు. పీసీసీ చీఫ్ మాత్రం, తాను చెప్పదల్చుకున్న అంశాన్ని చెప్పానని తెలిపారు. క్రమశిక్షణా కమిటీ ఇచ్చిన 36 పేజీల నివేదిక, కొండా సుష్మిత (Konda Susmita) చేసిన వ్యాఖ్యల ఇంగ్లీషు అనువాదాన్ని పీసీసీ నేతలు ఏఐసీసీకి సమర్పించారు.

అనుచరులతో వరంగల్‌లో కొండా సురేఖ భేటీ :

ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న కొండా సురేఖ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మీడియాతో మాట్లాడుతూ, తాను చెప్పదల్చుకున్నదంతా ఏఐసీసీ పెద్దలకు చెప్పానని, దానిపై తుది నిర్ణయం తీసుకోవాల్సింది వారేనని, ఎలాంటి నిర్ణయం వెలువడుతుందనేది తనకు తెలియదన్నారు. మరోవైపు ఢిల్లీలో జరిగిన పరిణామాలన్నింటినీ అనుచరులతో చర్చించేందుకు వరంగల్‌లో గురువారం సమావేశం కానున్నారు. పార్టీ తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా తదుపరి కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించే అవకాశమున్నది.

బీసీ నేతలంతా ఒకటవుతారు అని కామెంట్ చేసిన నేపథ్యంలో కుల సంఘాలతో చేపట్టనున్న కార్యాచరణపై ప్లానింగ్ చేసుకునే అవకాశమున్నది. మరోవైపు ఏఐసీసీ నిర్ణయం కఠినంగా ఉన్నట్లయితే శాసనసభ సభ్యత్వానికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల ద్వారా సత్తాను చాటాలనే అభిప్రాయం కూడా ఆమె సన్నిహితుల నుంచి వ్యక్తమవుతున్నది.

Also Read : రాష్ట్రంలో రాబోయేది వైఎస్సార్ యుగం.. రాజ‌గోపాల్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>