ఇన్‌స్టాగ్రామ్‌లో స్పేర్ పార్ట్స్ పేరుతో భారీ సైబర్ మోసం

కలం, నిర్మల్‌: ఇన్‌స్టాగ్రామ్‌లో మొబైల్‌ స్పేర్‌ పార్ట్స్‌ విక్రయాల పేరుతో మోసాలకు (Instagram Spare Parts Scam) పాల్పడుతున్న అంతర్రాష్ట్ర సైబర్‌ నేరగాడిని అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్‌ జిల్లా ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ బుధవారం తెలిపారు. నిందితుడిని రాజస్థాన్‌కు చెందిన ప్రకాశ్‌కుమార్‌ (22)గా గుర్తించినట్లు వెల్లడించారు. ఇచ్చోడకు చెందిన సమీర్‌ సయ్యద్‌ మొబైల్‌ షాప్‌ కోసం ఛార్జర్లు, డిస్‌ప్లేలు, ఇతర యాక్సెసరీస్‌ కొనుగోలు చేసేందుకు ఇన్‌స్టాగ్రామ్‌లో వెతుకుతుండగా ‘రాజ్‌ ఎల్‌ఈడీ ముంబై’ పేరుతో ఉన్న ఖాతా ద్వారా ప్రకాశ్‌కుమార్‌ పరిచయమయ్యాడు. తక్కువ ధరకు మొబైల్‌ స్పేర్‌ పార్ట్స్‌ అందిస్తామని నిందితుడు నమ్మించినట్లు పోలీసులు(Adilabad Police) తెలిపారు.

రూ.2.18 లక్షలు ఆన్‌లైన్‌లో చెల్లింపు

సరుకులను కొరియర్‌ ద్వారా పంపిస్తామని చెప్పి జూలై 25 నుంచి ఆగస్టు 8 మధ్య పలు విడతల్లో సమీర్‌ సయ్యద్‌ నుంచి నిందితుడు రూ.2,18,000 ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేయించుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం వాట్సాప్‌ ద్వారా కొరియర్‌ రసీదును పంపించి, సరుకులు పంపకుండా మోసం చేసినట్లు పేర్కొన్నారు. దీనిపై బాధితుడు 1930 సైబర్‌ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో నిందితుడిని రాజస్థాన్‌కు చెందిన ప్రకాశ్‌కుమార్‌గా గుర్తించి అరెస్టు చేశారు.

19 రాష్ట్రాల్లో 140 మందికి పైగా బాధితులు

నిందితుడి వద్ద నుంచి రెండు మొబైల్‌ ఫోన్లు, రూ.లక్ష నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల దర్యాప్తు ప్రకారం.. నిందితుడు ఇదే తరహాలో దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాల్లో సుమారు 140 మంది బాధితులను మోసం చేసినట్లు వెల్లడైంది. ఈ మోసాల ద్వారా మొత్తం రూ.5,30,33,494 మేరకు నగదు కొల్లగొట్టినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు.

ఆన్‌లైన్‌ కొనుగోళ్లలో అప్రమత్తంగా ఉండాలి

సైబర్‌ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ముఖ్యంగా సోషల్‌ మీడియా వేదికల ద్వారా వస్తువులు కొనుగోలు చేసే సమయంలో విక్రేత వివరాలు, సంస్థ విశ్వసనీయత, చెల్లింపు వివరాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే లావాదేవీలు నిర్వహించాలని సూచించారు. అనుమానాస్పద ఆన్‌లైన్‌ లావాదేవీలు జరిగితే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>