ఫ్యామిలీ సర్టిఫికెట్లకు ఫుల్ డిమాండ్‌.. 10 వేలకుపైగా పెండింగ్‌!

కలం, కోరుట్ల: తహసీల్దార్‌ కార్యాలయాల ద్వారా జారీ చేసే ఫ్యామిలీ సర్టిఫికెట్లకు ఇటీవల భారీగా డిమాండ్‌ ఏర్పడింది. ప్రభుత్వం ఫ్యామిలీ సర్టిఫికెట్‌ జారీ చేసే అధికారాన్ని తహసీల్దార్‌కు అప్పగించడంతో పాటు, దరఖాస్తు చేసుకున్న రెండు రోజుల్లోనే సర్టిఫికెట్‌ జారీ చేయాల్సి ఉన్నప్పటికీ.. జగిత్యాల జిల్లా కోరుట్ల తహసీల్దార్‌ కార్యాలయంలో మాత్రం 10 వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఎస్‌ఐఆర్‌ (ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ) ప్రక్రియ నేపథ్యంలో ఫ్యామిలీ సర్టిఫికెట్‌ కోసం ప్రజలు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ప్రచారం చేయడం వల్లే..

ముఖ్యంగా తమ ఓటు హక్కును కాపాడుకోవడానికి, ఓటరు జాబితాలో తమ పేరు కొనసాగించుకోవడానికి ఫ్యామిలీ సర్టిఫికెట్‌ తప్పనిసరిగా అవసరమవుతుందని కొందరు మీ-సేవ కేంద్రాల నిర్వాహకులు ప్రజలకు ప్రచారం చేయడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని పలువురు ప్రజలు ఆరోపిస్తున్నారు. ఫ్యామిలీ సర్టిఫికెట్‌ అవసరమయ్యే వివిధ ప్రభుత్వ, న్యాయ, వారసత్వ తదితర అవసరాల కోసం మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా.. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో ఓటు హక్కు రక్షణకు ఇది తప్పనిసరి అన్న ప్రచారం ప్రజల్లో అయోమయానికి దారితీసిందని ప్రజలు పేర్కొంటున్నారు. దీంతో వాస్తవ పరిస్థితిని తెలుసుకోకుండానే పలువురు మీ-సేవ కేంద్రాలను ఆశ్రయించి ఫ్యామిలీ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారని చెబుతున్నారు.

రెండు రోజుల్లో జారీ చేయాల్సి ఉండగా..

ప్రభుత్వ నిబంధనల ప్రకారం దరఖాస్తు పరిశీలన అనంతరం అర్హత ఉన్న వారికి నిర్ణీత సమయంలో ఫ్యామిలీ సర్టిఫికెట్‌ జారీ చేయాల్సి ఉంటుంది. అయితే దరఖాస్తులు భారీగా పెరగడంతో కోరుట్ల తహసీల్దార్‌ కార్యాలయ సిబ్బందిపై పని భారం పెరిగింది. వేలాది దరఖాస్తులు పెండింగ్‌లో ఉండటంతో సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని పలువురు వాపోతున్నారు.

ప్రజల్లో అయోమయం.. అధికారులపై పని భారం..

ఎలాంటి అధికారిక సమాచారం లేకుండా సోషల్‌ మీడియా, మీ-సేవ కేంద్రాల ద్వారా జరుగుతున్న ప్రచారాన్ని నమ్మి ప్రజలు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చేసుకోవడంతో ఒకవైపు ప్రజల్లో అయోమయం నెలకొనగా.. మరోవైపు రెవెన్యూ అధికారులపై అదనపు పని భారం పడుతోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫ్యామిలీ సర్టిఫికెట్‌ అవసరం, దాని వినియోగం, ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో దాని పాత్రపై ప్రజలకు అధికారికంగా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు. తప్పుడు లేదా నిరాధారమైన సమాచారాన్ని ప్రచారం చేస్తూ ప్రజలను అనవసరంగా దరఖాస్తులు చేసుకునేలా ప్రోత్సహిస్తున్న మీ-సేవ కేంద్రాల నిర్వాహకులపై సంబంధిత ఉన్నతాధికారులు విచారణ జరిపి, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు తేలితే తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

సర్టిఫికెట్లు జారీ చేయాలి..

అదేవిధంగా ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న ఫ్యామిలీ సర్టిఫికెట్‌ దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి, అర్హత ఉన్న వారికి సర్టిఫికెట్లను జారీ చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎస్‌ఐఆర్‌ ఓటరు జాబితా సవరణకు సంబంధించి ప్రజల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు ఎన్నికల అధికారులు, రెవెన్యూ అధికారులు సమన్వయంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>