భద్రాచలం ఏజెన్సీలో మెరుపు తనిఖీలు.. గుడుంబా స్థావరాలు ధ్వంసం

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాచలం (Bhadrachalam) ఏజెన్సీ పరిధిలో పోలీసులు మెరుపు తనిఖీలు చేపట్టారు. దుమ్ముగూడెం మండలం సుజ్ఞానపురం గ్రామంలో బుధవారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అక్రమ గుడుంబా తయారీ కేంద్రాలను ధ్వంసం చేయడంతోపాటు, సరైన పత్రాలు లేని పలు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ​భద్రాచలం డీఎస్పీ అరుణ్ కుమార్ పర్యవేక్షణలో దుమ్ముగూడెం, చర్ల పోలీస్ స్టేషన్ల సిబ్బంది సంయుక్తంగా ఈ తనిఖీలు నిర్వహించారు. గ్రామంలోని పలు ప్రాంతాల్లో సోదాలు చేపట్టి గుడుంబా స్థావరాలను ధ్వంసం చేశారు. ధ్రువపత్రాలు లేని వాహనాలను సీజ్ చేసి చట్టపరమైన చర్యలు చేపట్టారు.

​ఈ సందర్భంగా డీఎస్పీ అరుణ్ కుమార్ గ్రామస్తులతో మాట్లాడారు. అక్రమ మద్యం తయారీ, విక్రయాలు, సైబర్ నేరాల వల్ల జరిగే నష్టాలపై అవగాహన కల్పించారు. గ్రామంలో ఎవరైనా అనుమానాస్పదంగా సంచరించినా, లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడినా వెంటనే సమాచారం అందించాలని కోరారు. ​ఈ ఆపరేషన్‌లో దుమ్ముగూడెం ఎస్‌హెచ్‌ఓ రాజు వర్మ, చర్ల ఎస్‌హెచ్‌ఓ వెంకటప్పయ్య, ఎస్‌ఐలు నర్సిరెడ్డి, కేశవ, శ్యాం ప్రసాద్, జగన్మోహన్ చారి పాల్గొన్నారు.

​ఉచిత పోలీస్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

గ్రామీణ ప్రాంత యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా, స్వయం సమృద్ధి సాధించాలని డీఎస్పీ అరుణ్ కుమార్ పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ శాఖ అందిస్తున్న ఉచిత పోలీస్ ఉద్యోగ శిక్షణను యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రణాళికాబద్ధంగా చదివి ఉద్యోగాలు సాధించాలన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>