కలం, నాగర్ కర్నూల్: కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలను నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినందుకే రాష్ట్రం, ప్రజలు అధోగతి పాలయ్యారని నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి (Marri Janardhan Reddy) విమర్శించారు. వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనపై నిరసన కార్యక్రమాలలో భాగంగా బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో ప్రజలు దగా పడితే ప్రజల ఆస్తులను, వనరులను కొల్లగొడుతూ ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు వారి కుటుంబ సభ్యులు సొమ్ము చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు.
మహాలక్ష్మి పథకాన్నీ నీరుగార్చారని… మహాలక్ష్మి మాత్రం ధనం రూపంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్ళకే వస్తుందని జనార్దన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రజల సంక్షేమం పక్కన పెట్టి ధనార్జనే ధ్యేయంగా ఎమ్మెల్యేలు మంత్రులు పని పెట్టుకున్నారని ఆరోపించారు. ఆరు గ్యారంటీలలో మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం కల్పించి కొట్లాటలు పెట్టారని మిగతా ఏ ఒక్క గ్యారంటీని సక్రమంగా అమలు చేసిన పాపాన పోలేదని మర్రి దుయ్యబట్టారు. 500కు గ్యాస్ సిలిండర్ రెండు నెలలు కూడా ఇవ్వలేదని.. రైతు భరోసా రూ.15 వేలు ఇస్తామని మోసం చేశారని ఆయన విమర్శించారు.
కృష్ణా, గోదావరి నీటిని ఆంధ్రప్రదేశ్ తరలించుకుంటున్నా.. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం నీటిని ఎత్తిపోయడానికి ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందని జనార్దర్ రెడ్డి ప్రశ్నించారు. ఉద్దేశపూర్వకంగానే సాగునీరు ఇవ్వకుండా కుట్రపూరితంగా రైతులకు ద్రోహం చేస్తుందని మర్రి జనార్దన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ సంపదను పందికొక్కుల్లా దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు నాయకుల పై మర్రి జనార్దన్ రెడ్డి తీవ్రస్థాయిలో మర్రి జనార్దన్ రెడ్డి మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.

