‘కాళేశ్వరం’ పేరుతో సెంటిమెంట్‌ రాజకీయాలు : ఎమ్మెల్యే రేవూరి

కలం, హనుమకొండ : గత పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌ రెడ్డి (MLA Revuri Prakash Reddy) విమర్శించారు. మాయమాటలతో అధికారంలోకి వచ్చి ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని ఆరోపించారు. బుధవారం హనుమకొండ డీసీసీ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వరంగల్‌ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు ఇనుగాల వెంకటరామిరెడ్డి, ఎండీ ఆయూబ్‌తో కలిసి రేవూరి మాట్లాడారు.

కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో సెంటిమెంట్‌ రాజకీయాలు చేయడం మానుకోవాలని బీఆర్ఎస్ నేతలకు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సూచించారు. బీఆర్‌ఎస్‌ పాలనలో ప్రశ్నించే గొంతులను అణచివేశారని, దళితులకు మూడెకరాల భూమి, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, నిరుద్యోగ భృతి, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య వంటి హామీలను అమలు చేయలేదని ఆయన విమర్శించారు. ఖమ్మం రైతులకు బేడీలు వేసిన చరిత్ర బీఆర్‌ఎస్‌దేనని రేవూరి ధ్వజమెత్తారు. రేషన్‌ కార్డుల విషయంలోనూ గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 15.46 లక్షల కొత్త రేషన్‌ కార్డులు జారీ చేసి, మొత్తం 1.06 కోట్ల కార్డులు అందుబాటులోకి తెచ్చామని ప్రకాష్ రెడ్డి తెలిపారు. పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్‌ ప్రభుత్వ ధ్యేయమని పేర్కొంటూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, రూ.500 గ్యాస్‌ సిలిండర్‌, ఇందిరమ్మ ఇళ్లు, ఆరోగ్యశ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంపు, కొత్త రేషన్‌ కార్డులు వంటి పథకాలను అమలు చేస్తున్నామని ఆయన వివరించారు. బీఆర్‌ఎస్‌ అహంకారం, అవినీతి, నియంతృత్వానికి ప్రజలు చరమగీతం పాడి కాంగ్రెస్‌కు పట్టం కట్టారని రేవూరి అన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>