రాష్ట్రంలో రాబోయేది వైఎస్సార్ యుగం.. రాజ‌గోపాల్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

క‌లం, వెబ్‌డెస్క్‌: మునుగోడు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి (Komatireddy Raj Gopal Reddy) మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వైఎస్సార్ (YSR) వ‌ర్ధంతి సంద‌ర్భంగా నియోజ‌క‌వ‌ర్గంలో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న మాట్లాడారు. రాష్ట్రంలో రాబోయేది వైఎస్సార్ యుగ‌మేన‌ని రాజ‌గోపాల్ అన్నారు. వైఎస్సార్‌కు రాష్ట్రంలో ల‌క్ష‌లాది మంది అభిమానులున్నార‌ని చెప్పారు. ఆయ‌న స్ఫూర్తితోనే రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌ని, తాను ఎప్ప‌టికీ వైఎస్సార్ శిష్యుడినేన‌ని అన్నారు. రాజ‌కీయాల్లో ఉన్నంత కాలం వైఎస్సార్ ఆశ‌యాల కోసం పాటు ప‌డ‌తాన‌ని తెలిపారు.

ఇక స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు తాను కూడా సీఎం అవుతాన‌ని రాజ‌గోపాల్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌కు ఏ ప‌ద‌వులు వ‌చ్చినా ఒక సామాన్య పౌరుడికి వ‌చ్చిన‌ట్లేన‌ని చెప్పారు. ఏ ప‌ద‌వి వ‌చ్చినా నిజాయితీగా, నిస్వార్థంగా సేవ చేస్తాన‌న్నారు. ప‌ద‌వులు అంటే త‌న‌కు కిరీటం కాద‌ని, బాధ్య‌త అని స్ప‌ష్టం చేశారు. ఈ మ‌ధ్య చాలా మంది వ్య‌క్తులు కాంగ్రెస్ పార్టీలోకి వ‌చ్చార‌న్నారు. కాంగ్రెస్ పార్టీ బ‌లోపేతం కావ‌డానికి ఇత‌ర పార్టీల నేత‌ల‌ను ఇంత కాలం ఆహ్వానించుకున్న‌ట్లు తెలిపారు. కానీ, త‌మ పార్టీలోకి వ‌చ్చి త‌మ‌నే వెళ్ల‌గొడ‌తామంటే స‌హించేది లేద‌న్నారు. తాను పార్టీలో ఉండ‌గా కాంగ్రెస్‌ను ఎవ‌రూ క‌బ్జా చేయ‌లేర‌ని స్ప‌ష్టం చేశారు.

మునుగోడుతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న నిజ‌మైన కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని రాజ‌గోపాల్ భ‌రోసా ఇచ్చారు. పేద ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉండేందుకు, విద్య , వైద్యం కోసం త‌ప్ప‌కుండా పోరాటం చేస్తాన‌న్నారు. తెలంగాణ ప్ర‌జ‌ల‌కు అన్యాయం జ‌రగొద్ద‌న్న‌దే త‌న ఆలోచ‌న అన్నారు. ఒరిజిన‌ల్ కాంగ్రెస్ నాయ‌కుల‌కు అన్యాయం జ‌రుగుతోంద‌ని తెలిపారు. తెలంగాణ ప్ర‌భుత్వంలో ఉన్న‌త ప‌ద‌వుల్లో ఎవ‌రున్నారో ప్ర‌జ‌లంద‌రికీ తెలుసున‌న్నారు.

రాష్ట్రం కోసం 12 వంద‌ల మంది బ‌లిదానాలు చేశార‌ని, అందుకే సోనియా గాంధీ రాష్ట్రం ఇచ్చార‌ని రాజ‌గోపాల్ తెలిపారు. అలాంటి రాష్ట్రంలో తెలంగాణ ప్ర‌జ‌లకు, నిజ‌మైన కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల‌కు అన్యాయం జ‌ర‌గొద్ద‌ని చెప్పారు. సీమాంధ్రుల చెప్పు చేత‌ల్లో తెలంగాణ స‌ర్కార్ ఉండొద్ద‌ని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కానీ, రాష్ట్రంలో ప‌రిస్థితులు వేరే విధంగా ఉన్నాయ‌న్నారు. రాహుల్ గాంధీ, మీనాక్షితో కూడా ఈ విష‌యాలు చెప్పామ‌న్నారు. కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ప‌డుతున్న ఇబ్బందుల‌పై ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. నిజ‌మైన కార్య‌క‌ర్త‌ల‌ను అన్యాయం జ‌రుగుతోంద‌న్నారు. చివ‌రి నిమిషంలో వేరే పార్టీ వాళ్ల‌కు టికెట్లు ఇస్తే నిజ‌మైన కార్య‌క‌ర్త‌ల‌కు ఇబ్బంది త‌ప్ప‌ద‌న్నారు.

వ్య‌క్తిగ‌తంగా త‌న‌కు ఎవ‌రితో ఇబ్బంది లేద‌ని, కేవ‌లం పార్టీ కోస‌మే ఇదంతా చేస్తున్నాన‌ని రాజ‌గోపాల్ రెడ్డి అన్నారు. తాను తెలంగాణ ఉద్య‌మంలో పోరాడాన‌ని, పార్ల‌మెంట్‌లో ప్ర‌త్యేక రాష్ట్రం కోసం గొంతు వినిపించాన‌ని గుర్తు చేశారు. త‌న లాంటి వాళ్ల‌కు అన్యాయం జ‌రిగితే ఎలా అని ప్ర‌శ్నించారు. త‌న‌లాంటి వారిపై వెట‌కారంగా, వ్య‌క్తిత్వ హ‌న‌నం చేసే క‌థ‌నాలు వ‌స్తున్నాయ‌ని చెప్పారు. నిజ‌మైన కాంగ్రెస్‌ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను కాపాడుకోవాల‌ని పిలుపునిచ్చారు. ఇక త‌మ‌ నాయ‌కుడు ఎప్ప‌టికీ రాహుల్ గాంధీయే అని, అధిష్టానం ఏ నిర్ణ‌యం తీసుకున్నా క‌ట్టుబ‌డి ఉంటామ‌ని తెలిపారు. అయితే మ‌ధ్య‌లో ఉన్న వాళ్లు అవ‌మానిస్తే స‌హించేది లేద‌ని స్ప‌ష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>