కలం, కరీంనగర్ బ్యూరో: భారత విద్యార్థి ఫెడరేషన్ (SFI Karimnagar) కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం నగరంలోని పీఎంఎల్ (PML) బ్యాంకెట్ హాల్‌నందు నిర్వహించిన సెమినార్ విశేషంగా సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్ఎఫ్ఐ జాతీయ సహాయ కార్యదర్శి ఐషి ఘోష్ మాట్లాడుతూ.. భారతదేశంలో ప్రశ్నించే గొంతులు తమ హక్కులు, సమస్యల సాధన కోసం నిరంతరం పోరాడుతున్నాయని అన్నారు. ఢిల్లీ వీధుల్లో విద్యార్థులు సాగించిన సమరశీల పోరాటాలు దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని సైతం గజగజలాడించాయని ఆమె గుర్తుచేశారు.
ప్రశ్నించే పోరాటతత్వం పెరుగుతోంది..
లక్షలాది గొంతుకలు ఒకటై అణిచివేతను ఎదిరించి నిలబడటంతోనే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దిశగా పోరాటాలు తీవ్రరూపం దాల్చాయని పేర్కొన్నారు. “నేటి తరం యువతలో ప్రశ్నించే పోరాటతత్వం పెరుగుతోంది, దీనిని ఎవరూ ఆపలేరు. మన గొంతుకే మన ఆయుధం, ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కొనే సత్తా యువతకు ఉంది” అని ఆమె స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు రజనీకాంత్, రాష్ట్ర కార్యదర్శి టి. నాగరాజు మాట్లాడుతూ తెలంగాణలో విద్యార్థుల విప్లవం మొదలైందని తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం పాలిటెక్నిక్ విద్యార్థులు రోడ్డెక్కి పోరాడటంతోనే ప్రభుత్వం దిగిరాక తప్పలేదని, నేటి విద్యార్థి ఉద్యమాలకు ప్రభుత్వాలు భయపడుతున్నాయని అన్నారు.
విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలి..
కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని ఆరోపించారు. తక్షణమే విద్యార్థి వ్యతిరేక నిర్ణయాలను ఉపసంహరించుకుని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సెమినార్‌లో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు అరవింద్, కార్యదర్శి శ్రీకాంత్, జిల్లా గర్ల్స్ కన్వీనర్ మానస, రాష్ట్ర కమిటీ సభ్యురాలు సంజన, జిల్లా ఉపాధ్యక్షులు వినయ్ సాగర్, బోగేష్, ఈసాక్, ఆకాష్, జిల్లా కమిటీ సభ్యులు రోహిత్, రాకేష్, సందేశ్, సన్నీ, నాయకులు రిషి, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

