కలం, వెబ్ డెస్క్ : బీజేపీ తెలంగాణ చీఫ్ రాంచందర్ రావు అరెస్ట్ పై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ (Nitin Nabin) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాంచందర్ రావు అరెస్ట్ ను ఖండిస్తూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ చేసిన దాడికి గురైన బీజేపీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడిని పరామర్శించేందుకు వెళ్తుండగా, ఆ పర్యటనను పోలీసులు అడ్డుకోవడంపై రాంచందర్ రావుతో మాట్లాడినట్లు నితిన్ నబీన్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ అరాచక ముఠాలు దాడులు చేసినప్పుడు ప్రభుత్వ యంత్రాంగం మౌనంగా ఉంటుందని.. బాధితులకు అండగా నిలిచేందుకు వెళ్తే బీజేపీ నాయకులను మాత్రం అరెస్టులు చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. రాజ్యాంగం గురించి కాంగ్రెస్ అగ్రనేత చెప్పే నీతులు కేవలం నాటకం మాత్రమేనని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నియంతృత్వ పాలనకు తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని నితిన్ నబీన్ హెచ్చరించారు.

