కలం, నిజామాబాద్ బ్యూరో: పార్టీ లైన్ దాటొద్దని కేసీఆర్ పలుమార్లు మధ్యవర్తుల ద్వారా కవిత(Kavitha)కు చెప్పినా వినిపించుకోలేదని బాల్కొడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి (MLA Prashanth Reddy) పేర్కొన్నారు. మొండి వైఖరి వీడకపోవడంతోనే పార్టీ నుంచి బహిష్కరించారని స్పష్టం చేశారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా భీంగల్ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం సోమవారం నిజామాబాద్ నగరంలో నిర్వహించిన పాంచజన్యం సభలో తనపై కవిత చేసిన ఆరోపణలకు ప్రశాంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ‘కవిత మధ్యలో వచ్చారు.. మధ్యలో వెళ్లిపోయారు. నా తండ్రి సురేందర్ రెడ్డి, నేను టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యులం. నేను కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో చెబుతున్నా. కవిత కాంగ్రెస్ వారితో మంతనాలు జరపలేదని ఈ ఆలయానికి వచ్చి ప్రమాణం చేయగలరా..?’ అని సవాల్ విసిరారు.
ఆ విషయం కేసీఆర్‌కి బాగా తెలుసు..
కేసీఆర్, కవితను తానే విడదీశానంటూ చేసిన ఆరోపణలను ప్రశాంత్ రెడ్డి (MLA Prashanth Reddy) ఖండించారు. ‘వారిని విడదీయడానికి ప్రయత్నం చేశానా.. కలపడానికి ప్రయత్నం చేశానా.. అనేది కేసీఆర్(KCR)కు బాగా తెలుసు. కేసీఆర్‌కి దగ్గరగా ఉన్న మాలాంటి నేతలను లక్ష్యంగా చేసుకుని కవిత నిరాధారణమైన ఆరోపణలతో టార్గెట్ చేస్తున్నారు. ఎవరి లాభం కోసం ఇలా చేస్తున్నారు. కష్టకాలంలో కేసీఆర్‌కు తోడుగా ఉన్నది ప్రశాంత్ రెడ్డినా.. కవితనా.. అనేది జనాలకు బాగా తెలుసు. అసెంబ్లీ లోపల, బయట రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాటం చేస్తోంది ఎవరు.. అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అంటేనే ప్రశాంత్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి అంటేనే బీఆర్ఎస్’ అని కుండ బద్దలు కొట్టారు.
సానుభూతి కోసమే సభలో కన్నీళ్లు..
కవిత స్వలాభం కోసం వ్యక్తిగత ప్రతిష్ఠలు దెబ్బ తీసేలా మాట్లాడడం కరెక్ట్ కాదని ప్రశాంత్ రెడ్డి హితవు పలికారు. ‘తనపై నిరాధారమైన ఆరోపణలు చేసి హక్కు కవితకు లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యులుగా ఉన్న హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, నాలాంటి వాళ్లను కవిత లక్ష్యంగా చేసుకుంటున్నారు. పరోక్షంగా అధికార పార్టీని బలోపేతం చేసేలా కవిత వ్యాఖ్యలు చేస్తున్నారు. సభలో కన్నీళ్లు పెట్టుకోవడం కవిత రాజకీయంగా సానుభూతిని పొందడానికే అని అర్థమవుతోంది.
కవిత చేసే ఇలాంటి పనుల వలన కేసీఆర్ ఎంత మనోవేదన చెందుతున్నారో ఆమె ఆలోచించడం లేదు. నిన్నటి మాటలతో కేసీఆర్ బిడ్డ అనే గౌరవాన్ని పోగొట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్. ఆయనపైనే విమర్శలు చేస్తున్న కవిత.. కేటీఆర్, హరీష్ రావు, తనపైనా విమర్శలు చేయడంలో పెద్దగా ఆశ్చర్యం లేదు. కానీ, కవిత మాటలు బాధగా అనిపించాయి’ అని ప్రశాంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read : మెస్సీ రిటైర్మెంట్.. రేవంత్ రెడ్డి ఎమోషనల్ పోస్ట్!
Follow Us On: Youtube

