రేవంత్ పాలన @వెయ్యి రోజులు..!

కలం, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) కొలువుదీరి సెప్టెంబర్ 1 నాటికి వెయ్యి రోజులవుతుంది. 2023 డిసెంబర్ 7న ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి (Revanth Reddy) బాధ్యతలు చేపట్టి.. గడీల పాలనకు కాలం చెల్లిందని, తమది ప్రజా పాలన అని ప్రకటించారు. ఈ వెయ్యిరోజుల్లో ఆయన సారథ్యంలో సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయం అనే మూడు సూత్రాలతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని ప్రభుత్వం గుర్తుచేసుకుంది. పేద, మధ్య తరగతి ప్రజల కోసం ఎన్నో కీలక స్కీమ్‌లు తీసుకువచ్చామని.. మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా వారికి తోడ్పాటునందిస్తున్నామని.. ‘తెలంగాణ రైజింగ్‌’ నినాదంతో ముందుకు సాగుతున్నామని ఒక ప్రకటనలో వివరించింది.

ప్రజల ఆకాంక్షలే కేంద్ర బిందువుగా..!

హైదరాబాద్ కేంద్రంగా మొదలైన ప్రజావాణి ఇప్పడు ప్రతీవారం మండల స్థాయిలోనూ కొనసాగుతున్నది. అటు స్విట్జర్లాండ్‌లోని దావోస్ వేదికగా, ఇటు ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వరకు పెట్టుబడులకు హైదరాబాద్, ఫ్యూచర్ సిటీ కేంద్రాలుగా మారాయి. తెలంగాణ ప్రగతిలో సరికొత్త అధ్యాయాన్ని నమోదు చేసినట్లు ప్రభుత్వం పేర్కొన్నది. రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, కార్మికులు, పేదలు, మధ్యతరగతి కుటుంబాలకు ప్రత్యక్ష లబ్ధి చేకూర్చే పథకాల అమలుతో పాటు కొత్త చట్టాలు, కొత్త విధానాలు, కొత్త సంస్థలు, కీలక పరిపాలనా సంస్కరణలకు శ్రీకారం చుట్టినట్లు వివరించింది. ప్రజల ఆకాంక్షలనే పాలనకు కేంద్ర బిందువుగా చేసుకుని సాగిన వెయ్యి రోజుల ప్రస్తావాన్ని, ప్రజాపాలన విజయాలను ప్రభుత్వం వివరించింది.

తలసరి ఆదాయం 91% ఎక్కువ

జాతీయ స్థాయి సగటుతో పోలిస్తే గడిచిన ఆర్థిక సంవత్సరంలో (2025-26) రాష్ట్ర తలసరి ఆదాయం దాదాపు 91% ఎక్కువ అని ప్రభుత్వం పేర్కొన్నది. వ్యవసాయం నుంచి పరిశ్రమల దాకా, విద్య నుంచి వైద్యం వరకు, మహిళా సాధికారత నుంచి యువత ఉపాధి వరకు, సామాజిక న్యాయం నుంచి డిజిటల్‌ పాలన వరకు… ప్రతీ రంగంలో కొత్త నిర్ణయాలు తీసుకున్నట్లు వివరించింది. భారీ పెట్టుబడులను ఆకర్షించడం, ఉద్యోగ అవకాశాలను విస్తరించడం, ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలకు బాటలు వేయడం, భవిష్యత్తు తెలంగాణకు దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించడం ద్వారా రాష్ట్ర అభివృద్ధికి కొత్త దిశను నిర్దేశించిందని పేర్కొన్నది. వెయ్యి రోజుల ప్రజాపాలనలో అమలు చేసిన ప్రధాన పథకాలు, తీసుకున్న కీలక నిర్ణయాలు, చేసిన కొత్త చట్టాలు, సాధించిన విజయాలను ప్రస్తావించింది.

రైతు సంక్షేమం

– రైతులకు రూ.2 లక్షల వరకు పంట రుణాల మాఫీ. 25 లక్షలకుపైగా రైతు కుటుంబాలకు రుణ విముక్తి.
– రైతు భరోసా కింద రూ. 36 వేల కోట్లకుపైగా పెట్టుబడి సాయం. ఒకే విడతలో 9 రోజుల్లో రూ.9 వేల కోట్ల జమ.
– సన్నవడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్‌.
– వ్యవసాయానికి ఉచిత విద్యుత్, రైతు బీమా, పంట నష్టపరిహారంతో రైతులకు భరోసా.
– వ్యవసాయం, రైతు సంక్షేమానికి 32 నెలల్లో దాదాపు రూ.1.68 లక్షల కోట్ల వ్యయం.
– కృష్ణా, గోదావరి జలాల్లో న్యాయమైన వాటా సాధనకు ప్రత్యేక కార్యాచరణ. తుమ్మిడిహెట్టి నుంచి పాలమూరు వరకు పెండింగ్‌ సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం.

స్కీమ్‌ల‌తో ఆర్థిక చేయూత

– ‘మహాలక్ష్మి’ పథకంతో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. 335 కోట్లకుపైగా ఫ్రీ-టికెట్లతో మహిళలకు రూ.11 వేల కోట్లు ఆదా.
– ‘గృహజ్యోతి’తో 53 లక్షలకుపైగా కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు; 10 కోట్లకుపైగా జీరో బిల్లులు.
– రాష్ట్రంలో దాదాపు 43 లక్షల కుటుంబాలకు రూ.500కే వంటగ్యాస్‌ సిలిండర్‌.
– ‘కల్యాణలక్ష్మి’ ద్వారా 1.68 లక్షల మంది ఆడబిడ్డలకు రూ.4,709 కోట్ల సహాయం.
– 32 నెలల్లో 43.01 లక్షల మందికి సామాజిక భద్రతా పింఛన్లు. రూ.30,089 కోట్ల వ్యయం. కొత్తగా 2.25 లక్షల మందికి పింఛన్ల మంజూరు.

మహిళలకు అండగా..

– నాలుగున్నర లక్షల మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.60,487 కోట్ల బ్యాంకు లింకేజీ; రూ.1,900 కోట్ల వడ్డీ రాయితీ.
– మహిళా సంఘాలకు పాఠశాల యూనిఫాంలు, చీరల తయారీ, పెట్రోలు బంకుల నిర్వహణ, ఆర్టీసీకి అద్దె బస్సులు. వీటితో మహిళా సంఘాల ఆర్థిక స్వయంసమృద్ధి.

రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు:

– రాష్ట్రవ్యాప్తంగా 15 లక్షలకుపైగా కొత్త రేషన్‌ స్మార్ట్ కార్డుల జారీ. దాదాపు 3.38 కోట్ల మందికి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఆహార భద్రత. నాణ్యమైన సన్నబియ్యం పంపిణీతో ప్రజా పంపిణీ వ్యవస్థలో కొత్త విధానానికి శ్రీకారం.
– తొలి దశలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం. ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల సహాయం. హైదరాబాద్‌ ‘క్యూర్‌’ పరిధిలో లక్ష ఇందిరమ్మ ఇండ్ల టవర్ల నిర్మాణం.

కులగణన, ఎస్సీ వర్గీకరణ:

– రాష్ట్రవ్యాప్తంగా 1.12 కోట్లకుపైగా కుటుంబాలను కవర్‌ చేస్తూ సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే (కులగణన) పూర్తి. సర్వే ఆధారంగా కులాల వారీ సామాజిక, ఆర్థిక స్థితిగతుల వెల్లడి.
– సుప్రీంకోర్టు తీర్పు మేరకు 59 ఎస్సీ ఉపకులాలు మూడు గ్రూపులుగా వర్గీకరణ. ఎస్సీ వర్గీకరణ చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ.
– బీసీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లులకు శాసనసభ ఆమోదం.
– ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమానికి రాష్ట్ర మొత్తం వ్యయంలో 12.4% కేటాయింపు.

కనీస వేతనాల సవరణ:

– 12 ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న కనీస వేతనాల సవరణ. దాదాపు కోటి 11 లక్షల మంది కార్మికులకు ప్రయోజనం. నైపుణ్యం లేని కార్మికులకు రూ.16 వేలు, సెమీ స్కిల్డ్‌ కు రూ.17 వేలు, స్కిల్డ్‌ కు రూ.18,500, హైలీ స్కిల్డ్‌ కు రూ.20 వేల కనీస నెలవారీ వేతనం.
– ‘గిగ్‌ వర్కర్ల’కు చట్టబద్ధ గుర్తింపు, సంక్షేమ బోర్డు, సంక్షేమ నిధి, సామాజిక భద్రత కల్పించే ప్రత్యేక చట్టం.
– వృద్ధ తల్లిదండ్రులు నిరాదరణకు గురికాకుండా కుటుంబ బాధ్యతను బలోపేతం చేసే ప్రత్యేక చట్టం. ఉద్యోగుల వేతనాల్లోంచి చెల్లించే విధానం.
– ప్రభుత్వ, కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు చెల్లించేలా ఆర్థిక క్రమశిక్షణ. కొన్నేళ్లుగా పేరుకుపోయిన రిటైర్డ్‌ ఉద్యోగుల బకాయిల్లో వంద రోజుల్లో రూ.6,000 కోట్ల చెల్లింపు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఎంప్లాయీ హెల్త్‌ స్కీమ్‌ ద్వారా క్యాష్‌లెస్‌ వైద్య సేవలు.

చదువులు, కొలువులు:

– ఉన్నత విద్యాసంస్థల్లో వివక్షను అరికట్టేందుకు రోహిత్‌ వేముల తెలంగాణ బిల్లుకు రూపకల్పన.
– ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌. మొత్తం 105 స్కూళ్లలో 84 చోట్ల అనుమతులు, నిర్మాణ ప్రక్రియ వేగవంతం.
– ప్రభుత్వ పాఠశాలల్లో తొలిసారిగా ప్రీ-ప్రైమరీ తరగతుల ప్రారంభం. తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్లతో ప్రభుత్వ విద్యకు కొత్త నమూనా.
– ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్‌ వరకు 22 లక్షలకుపైగా విద్యార్థులకు ఉచిత బ్రేక్‌ఫాస్ట్, పాలు, పోషకాహారం; రూ.720 కోట్ల కేటాయింపు.
– ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లోనూ మధ్యాహ్న భోజన పథకం అమలు.
– సంక్షేమ హాస్టళ్లలో డైట్‌ ఛార్జీలు 40 శాతం, కాస్మొటిక్‌ ఛార్జీలు 212 శాతం పెంపు.
– డీఎస్సీ ద్వారా 10,006 మంది ఉపాధ్యాయుల నియామకం.
– ఉస్మానియా విశ్వవిద్యాలయానికి రూ.1,000 కోట్ల కేటాయింపు.
– రెండున్నరేండ్లలో 72 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు. గ్రూప్‌–1, గ్రూప్‌–2, గ్రూప్‌–3, గ్రూప్‌–4, డీఎస్సీ సహా కీలక నియామక ప్రక్రియల పూర్తి. టీజీపీఎస్సీ ద్వారా మరో 456 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు. పోలీసు నియామక బోర్డు ద్వారా 7,437 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.
– యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ ఏర్పాటు. 1,190 మంది అధునాతన నైపుణ్య శిక్షణ పూర్తి; 838 మందికి ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు.
– 65 ప్రభుత్వ ఐటీఐలు, 57 పాలిటెక్నిక్‌ కాలేజీలను అడ్వాన్స్‌ డ్‌ టెక్నాలజీ సెంటర్లుగా అప్‌గ్రెడేషన్.
– యంగ్‌ ఇండియా ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీ ఏర్పాటు. గచ్చిబౌలి స్పోర్ట్స్‌ డిస్ట్రిక్ట్‌ తో క్రీడా మౌలిక సదుపాయాల విస్తరణ.

కల్తీలకు, నేరాలకు చెక్:

– ఆహార కల్తీ, డ్రగ్స్‌ ముప్పును సమగ్రంగా ఎదుర్కొనేందుకు కొత్తగా ‘టీ-సేఫ్‌’ ఏర్పాటు.
– మాదకద్రవ్యాలపై ప్రత్యేకంగా ‘ఈగల్‌’ వ్యవస్థ ఏర్పాటు చేసి డ్రగ్‌ నెట్‌వర్క్‌ లపై కఠిన చర్యలు.
– సైబర్‌ నేరాల నియంత్రణకు ప్రత్యేక పోలీసింగ్‌, 1930 స్పందన వ్యవస్థ బలోపేతం.
– షీ టీమ్స్‌, భరోసా కేంద్రాలు, యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ యూనిట్లతో మహిళలు, పిల్లల భద్రతకు ప్రత్యేక చర్యలు.
– పట్టణ ట్రాఫిక్‌ రద్దీ, రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు కొత్తగా టీజీ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ రోడ్‌ సేఫ్టీ బ్యూరో ఏర్పాటు.

భూ భారతి, ప్రజావాణి, చేరువలో సేవలు:

– భూ భారతి చట్టంతో భూ పరిపాలనలో సమగ్ర సంస్కరణలు. ‘భూధార్‌’ ద్వారా భూములకు ప్రత్యేక గుర్తింపు, ఏఐ ఆధారిత భూమిత్ర సేవల ప్రారంభం.3.76 లక్షల కొత్త పట్టాదార్‌ పాస్‌బుక్స్‌ జారీ.
– ప్రజాపాలన–అభయహస్తం ద్వారా గ్రామాలు, వార్డుల్లోనే ఆరు గ్యారంటీలు, సంక్షేమ పథకాలకు దరఖాస్తుల స్వీకరణ.
– 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో 12,758 గ్రామసభలు, 3,175 వార్డుసభల నిర్వహణ. 1,06,598 పెండింగ్‌ ప్రభుత్వ ఫైళ్ల పరిష్కారం. 76 వేలకుపైగా రైతులను సూక్ష్మ సాగునీటి పరిధిలోకి తీసుకురావడం.
– రాష్ట్ర, జిల్లా, డివిజన్‌ స్థాయి ప్రజావాణి తర్వాత అన్ని ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రతీ సోమవారం మండల ప్రజావాణి. రాష్ట్రంలోని ఏ ప్రాంతం నుంచైనా అర్జీలు నమోదు చేసుకునేందుకు ఆన్‌లైన్‌ ప్రజావాణి పోర్టల్‌ ఏర్పాటు నిర్ణయం.
– 36 సచివాలయ శాఖల్లో 100% ‘ఈ-ఆఫీస్‌’ అమలు.
– దేశంలో తొలి పూర్తిస్థాయి డిజిటల్‌ కేబినెట్‌ నిర్వహణ.
– ‘వాట్సాప్‌’ ద్వారా 581కిపైగా ప్రభుత్వ సేవలు ప్రజలకు అందుబాటులోకి.

ఆరోగ్యమస్తు

– రాజీవ్‌ ఆరోగ్యశ్రీ చికిత్స పరిమితి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు.
– గోషామహల్‌లో రూ.2,700 కోట్లతో 2,000 పడకల నూతన ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం.
– సనత్‌నగర్‌ టిమ్స్ ప్రారంభం. అల్వాల్‌, ఎల్బీనగర్‌లో టిమ్స్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల ఏర్పాటు.
– తొమ్మిది కొత్త ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల ప్రారంభం. మరో 17 మెడికల్‌ కాలేజీల నిర్మాణం.
– నిమ్స్లో 2,000 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సల మైలురాయి. దాదాపు 1,900 మందికి ఉచిత చికిత్స. ప్రభుత్వ వైద్యరంగంలో దక్షిణ భారత తొలి రోబోటిక్‌ రీనల్‌ ట్రాన్స్‌ ప్లాంట్‌ నిమ్స్‌ లో నిర్వహణ.

కబ్జాలకు కళ్లెం.. మూసీకి జీవం..

– హైడ్రా ద్వారా చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూముల పరిరక్షణ. 1,045 ఎకరాల భూముల స్వాధీనం, దాదాపు రూ.60 వేల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ. బతుకమ్మకుంట, నల్లచెరువు సహా పలు చెరువుల పునరుద్ధరణ.
– మూసీ పునరుజ్జీవనానికి 55 కి.మీ. సమగ్ర అభివృద్ధి ప్రణాళిక. మూసీ పరిధిలో 39 కొత్త ఎస్టీపీల నిర్మాణం. గోదావరి నుంచి 2.5 టీఎంసీల స్వచ్ఛమైన నీటిని మూసీకి తరలించే ప్రణాళిక.

ఇంకా ఎన్నో..!

– హైదరాబాద్‌ చుట్టూ దాదాపు 360 కి.మీ. రీజనల్‌ రింగ్‌ రోడ్డు ప్రాజెక్టు. సిటీ చుట్టూ రేడియల్‌ రోడ్ల విస్తరణ.
– రాష్ట్రవ్యాప్తంగా 6,092 కిలోమీటర్ల హ్యామ్‌ రోడ్ల అభివృద్ధి.
– వరంగల్‌లోని మామునూరు విమానాశ్రయ పునరుద్ధరణ. ఆదిలాబాద్‌లో జాయింట్‌ యూజ్‌ ఎయిర్‌ఫీల్డ్‌ అభివృద్ధి.
– తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ (2025లో) 100 అవగాహన ఒప్పందాల ద్వారా రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు.
– 2025-26లో తెలంగాణ ఐటీ ఎగుమతులు రూ.3.97 లక్షల కోట్లకు చేరిక. ప్రత్యక్ష ఐటీ ఉద్యోగాలు 12.14 లక్షలు.
– హైదరాబాద్‌లో 355కిపైగా గ్లోబల్‌ కెపాబిలిటీ సెంటర్లు. 2026లోనే మరో 40 కొత్త కేంద్రాలు. డేటా సెంటర్లు, క్లౌడ్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రంగాల్లో దేశంలో వేగంగా ఎదుగుతున్న ప్రధాన కేంద్రంగా తెలంగాణ.
– ‘క్యూర్‌’ (కోర్‌ అర్బన్‌ రీజియన్‌ ఎకానమీ), ‘ప్యూర్‌’ (పెరి అర్బన్‌ రీజియన్‌ ఎకానమీ), ‘రేర్‌’ (రూరల్‌ అగ్రి రీజియన్‌ ఎకానమీ) అనే మూడు అభివృద్ధి వలయాలతో రాష్ట్ర సమగ్ర ప్రణాళిక.
– దేశంలో తొలి నెట్‌-జీరో స్మార్ట్‌ సిటీగా ‘భారత్‌ ఫ్యూచర్‌ సిటీ’. ఇక్కడ ఏఐ సిటీ, డేటా సెంటర్లు, అడ్వాన్స్‌డ్‌ మాన్యుఫాక్చరింగ్‌, పరిశోధన, ఆవిష్కరణలకు ప్రపంచస్థాయి కేంద్రం ఏర్పాటు.

ఉద్యమ ఆకాంక్షలకు గుర్తింపు

– ‘జయ జయహే తెలంగాణ’ గీతానికి అధికారిక గౌరవం.
– ‘తెలంగాణ తల్లి’ విగ్రహాల ఆవిష్కరణ.
– తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వారికి, వారి కుటుంబాలకు సముచిత గౌరవం కల్పించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు.

ఆర్థిక వృద్ధి

– తెలంగాణ రైజింగ్‌–2047 కింద 2034 నాటికి ఒక ట్రిలియన్‌ డాలర్ల, 2047 నాటికి మూడు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దే లక్ష్యం.
– దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచే దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యం.ws

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>