కలం, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు సాయంత్రం సమయాల్లో స్పెషల్ క్లాసులకు హాజరయ్యే సమయంలో స్నాక్స్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మోడల్ పాఠశాలల్లో చదువుతున్న టెన్త్ విద్యార్థులకు ఇది వర్తించనున్నది. సమగ్ర శిక్షా అభియాన్ స్కీమ్ కింద 45 రోజుల పాటు ఇది కొనసాగనున్నది. వచ్చే ఏడాది మార్చి/ఏప్రిల్ నెలల్లో జరిగే పరీక్షల కోసం ‘రెమిడియల్ క్లాసెస్’ పేరుతో జరిగే ప్రత్యేక తరగతుల కోసం దీన్ని ఉద్దేశించినట్లు ప్రాజెక్టు డైరెక్టర్ నవీన్ నికొలస్ అన్ని జిల్లా విద్యాశాఖ అధికారులకు జారీ చేసిన సర్క్యులర్లో పేర్కొన్నారు. ఈ 45 రోజుల షెడ్యూల్ను త్వరలోనే ఖరారు చేయనున్నట్లు తెలిపారు. ఈ స్కీమ్ కింద నిధుల వినియోగానికి సంబంధించి యుటిలైజేషన్ సర్టిఫికెట్లను అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులు సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఈ నిధుల ద్వారా రాష్ట్రంలో 1,44,379 మంది సమగ్ర శిక్షా విద్యార్థులు, 44,761 మంది ‘పీఎం-శ్రీ’ విద్యార్థులు ప్రయోజనం పొందనున్నారు.
ఒక్కో విద్యార్థికి రోజుకు సగటున రూ.15
– వచ్చే ఏడాది మార్చి/ఏప్రిల్ నెలల్లో వార్షిక పరీక్షలు రాసే టెన్త్ విద్యార్థులకు ప్రత్యేక తరగతుల సమయంలో శారీరక, మానసిక వికాసం కోసం ఈ ‘స్నాక్స్’ విధానాన్ని తీసుకొచ్చినట్లు ప్రాజెక్టు డైరెక్టర్ నవీన్ నికొలస్ తెలిపారు.
– ఒక్కో విద్యార్థికి సగటున రోజుకు రూ. 15 చొప్పున ఖర్చవుతుందని అంచనా వేసినట్లు వివరించారు. స్నాక్స్ పేరుతో విద్యార్థులకు ప్రతీ రోజు సాయంత్రం టైమ్లో ఉడకబెట్టిన పెసర్లు, బొబ్బర్లు, శెనగలు, పల్లీ-బెల్లం, ఉల్లి పకోడీ, మిల్లెట్ బిస్కెట్లు ఉంటాయని తెలిపారు. ఇందుకోసం మొత్తంగా రూ. 12,76,69,500 ఖర్చవుతున్నట్లు అంచనా వేశామని, దీన్ని మూడు జిల్లాల విద్యాశాఖల నుంచి సర్దుబాటు చేస్తున్నట్లు చెప్పారు.
– ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల ‘డైట్’ విద్యా సంస్థల దగ్గర ఖర్చు కాని నిధులు రూ. 12,91,80,183 ఉన్నాయని, ఇందులోంచి రూ. 12,76,69,500 ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ఆయా జిల్లాల ‘డైట్’ ప్రిన్సిపాళ్ల నుంచి అనుమతి తీసుకున్న తర్వాతనే ఈ నిధులను విడుదల చేయడంపై నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.
అన్ని జిల్లాలకు 3 జిల్లాల ‘డైట్’ నుంచి రిలీజ్
ఖమ్మం జిల్లా ‘డైట్’ నుంచి 14 జిల్లాలకు రూ. 4,73,16,150, నిజామాబాద్ ‘డైట్’ నుంచి మరో 14 జిల్లాలకు రూ. 6,18,53,141, కరీంనగర్ ‘డైట్’ నుంచి 5 జిల్లాలకు రూ. 1,85,00,209 చొప్పున అందుతాయని నవీన్ నికొలస్ తెలిపారు. ఏయే జిల్లాలో ఎంతమంది టెన్త్ విద్యార్థులకు ఈ స్కీమ్ వర్తింపజేయాలో, ఏ జిల్లా ‘డైట్’ నుంచి ఎంత మొత్తం విడుదల చేయాలో ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారులకు సర్క్యులర్లో ప్రాజెక్టు డైరెక్టర్ నికొలస్ స్పష్టం చేశారు.

