కలం, జోగులాంబ గద్వాల: ఆలంపూర్ ఆలయ (Alampur Temple) అభివృద్ధికి ప్రసాద్ పథకంలో భాగంగా ఇప్పటికే పలు పనులను చేయడం జరిగిందని కేంద్ర బొగ్గు, గనుల శాఖల మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. భవిష్యత్తులో కూడా మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఆదివారం సాయంత్రం అలంపూర్ ఆలయాల వద్ద మల్టీమీడియా, సౌండ్, లైట్స్ షోను ఇతర అతిధులతో కలిసి ప్రారంభించిన మంత్రి ఈ సందర్భంగా మాట్లాడారు. ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టత కలిగిన ఆలంపూర్ ఆలయాలను పెద్ద సంఖ్యలో భక్తులు దర్శిస్తుంటారని, భక్తులకు ప్రతి రోజు సాయంత్రం 25 నిమిషాల పాటు ఆలయ చరిత్రను తెలియజేస్తూ ప్రదర్శనలు ఇవ్వడం జరుగుతుందన్నారు.
రూ.700 కోట్ల నిధులు కేటాయించాం..
ఇదివరకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలోని సుమారు 15 పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి రూ.700 కోట్ల నిధులను కేటాయించినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు వచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంతో కృషిచేసిందని పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎన్నో దర్శనీయ స్థలాలను అభివృద్ధి చేసేందుకు పెద్ద ఎత్తున నిధులను కేటాయిస్తున్నట్లు తెలిపారు. గోల్కొండ కోట, ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల వద్ద సౌండ్ అండ్ లైట్ షో ఏర్పాటు చేశామన్నారు. జోగులాంబ రైల్వేస్టేషన్ ను అమృత్ పథకంలో భాగంగా అభివృద్ధి చేశామని, ఈ ప్రాంత వాసులు ఆలంపూర్ క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు సలహాలు ఇవ్వవచ్చని సూచించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అనేక ఆధ్యాత్మిక ప్రదేశాలను కూడా అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా కేంద్రమంత్రి వివరించారు.
మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నాం..
మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ ఆలంపూర్ ఆలయాల వద్ద భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ పథకంలో భాగంగా అన్నదాన భవనం, విశ్రాంతి గదులు, ఫుడ్ కోర్టు, కల్చరల్ థియేటర్, తదితర విభాగాలతో పాటు తుంగభద్ర నదిలో బోటింగ్ సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు. అమృత్ పథకంలో భాగంగా జోగులాంబ రైల్వే స్టేషన్ తో పాటు గద్వాల రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు వేగవంతంగా జరుగుతున్నట్లు తెలిపారు. నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ.. ఆలంపూర్ ఆలయ విశిష్టతను తెలియజేస్తూ మల్టీమీడియా సౌండ్ లైట్స్ ప్రదర్శన ఏర్పాటు చేయడంతో టెంపుల్ టూరిజం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ఆలంపూర్ ఆలయాలను మరింత అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతామని పేర్కొన్నారు. డోర్నకల్ నుంచి గద్వాలకు రైల్వే లైన్ ఏర్పాటుకు కూడా కృషి చేస్తున్నట్లు తెలిపారు.

