కామారెడ్డిలో నకిలీ నోట్ల గుట్టురట్టు.. రూ. లక్షకు రెండు లక్షలు!

కలం, నిజామాబాద్ బ్యూరో: అసలు నోట్లు రూ. లక్ష ఇస్తేచాలు.. రెండింతల నకిలీ నోట్లు తీసుకోవచ్చు. ఇలాంటి దందా హైదరాబాద్ కేంద్రంగా నడుస్తుండగా, మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన కామారెడ్డి (Kamareddy) జిల్లాలో చెలామణి గుట్టు బయటపడింది. మహారాష్ట్ర నుంచి వచ్చిన ముగ్గురు యువకులు నకిలీ నోట్లను పిట్లంలోని పెట్రోల్ బంక్లో చలామణి చేశారు. పెట్రోల్ పోయించుకుని నాలుగు 500 నోట్లు ఇచ్చి వెళ్లారు. బంక్ యజమాని ఫిర్యాదుతో నలికీ నోట్ల దందా అంతర్ రాష్ట్ర ముఠా గుట్టు రట్టు పోలీసులు బట్టబయలు చేశారు. ఇతర రాష్ట్రాల్లోనూ సంబంధాలపై ఆరా తీసే పనిలో పడ్డారు.

పెట్రోల్ బంక్ లో ఇచ్చి వెళ్లగా..

మహారాష్ట్రలోని పర్బణి జిల్లాకు చెందిన యువకుడు రావు సాహెబ్ తనకు పరిచయమైన ఓవ్యక్తి ద్వారా హైదరాబాద్ లోని ముదస్సర్ హుస్సేన్ అలియాస్ షాబాబా వద్ద నకిలీ కరెన్సీ దొరుకుతుందని తెలుసుకున్నాడు. తన ఫ్రెండ్స్ ప్రతీక్, భీమ్ శంకర్ రావ్ తో కలిసి వెళ్లి షాబాబా వద్ద రూ. లక్ష అసలు కరెన్సీ ఇచ్చి రూ.2 లక్షల నకిలీ కరెన్సీ తీసుకున్నారు. ఈనెల 26న పిట్లం హైవే సమీపంలోని పెట్రోల్ బంకులో రూ.2 వేల పెట్రోల్ పోయించుకొని రూ.500 నకిలీ నోట్లు నాలుగు ఇచ్చారు. అవి నకిలీ నోట్లుగా బంక్ క్యాషియర్ గుర్తించి కారును ఆపేందుకు ప్రయత్నం చేయగా దొరక్కుండా వెళ్లిపోయారు. దీంతో క్యాషియర్ శ్రీకాంత్ రెడ్డి మరుసటి రోజు పిట్లం పీఎస్లో ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. కాగా, మిగిలిన నకిలీ నోట్లను చలామణి చేయడానికి ముగ్గురు నిందితులు కారులో హైదరాబాద్ బయలుదేరగా, ధర్మారం టోల్ ప్లాజా వద్ద పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ.500 విలువైన 182 నకిలీ నోట్లు, మొత్తం రూ.91 వేలు, మూడు సెల్ ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ కరెన్సీ సరఫరా చేసిన ఇతర వ్యక్తుల పాత్రపై దర్యాప్తు నిర్వహిస్తున్నారు.

ఇతర రాష్ట్రాల్లో లింక్లపైనా ఆరా

ఇతర రాష్ట్రాల్లోనూ నిందితుల సంబంధాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. నిందితులను పట్టుకోవడంలో పిట్లం, బాన్సువాడ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించారు. ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాలతో ఆపరేషన్ చేసినట్టు వెల్లడించారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని వివరించారు. విచారణ కొనసాగుతుందని ఇతర రాష్ట్రాల వ్యక్తుల ప్రమేయం, చలామణి చేసిన ప్రాంతాల్లోనూ ఇంకా లోతైన విచారణ జరుపుతున్నట్టు పోలీసులు వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>