కలం, నిర్మల్: రాఖీ పండుగ అంటే అన్నాచెల్లెళ్ల ఆత్మీయతకు ప్రతీక. సోదరులకు రాఖీ కట్టేందుకు అక్కాచెల్లెళ్లు, కుటుంబ సభ్యులు సొంతూళ్లకు పయనమవుతున్న వేళ ఆర్టీసీ (TGSRTC) ప్రత్యేక బస్సుల చార్జీలు ప్రయాణికులకు భారంగా మారుతున్నాయి. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిన అధికారులు.. వాటిలో సాధారణ చార్జీల కంటే అదనంగా వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. రాఖీ పండుగ సందర్భంగా నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రం నుంచి ఆదిలాబాద్, మంచిర్యాల తదితర ప్రాంతాలకు పెద్ద సంఖ్యలో ప్రయాణికులు తరలివెళ్తున్నారు. సాధారణ సర్వీసులతో పాటు ప్రత్యేక బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేసింది. అయితే ఈ ప్రత్యేక బస్సుల్లో ప్రయాణించే పురుష ప్రయాణికుల నుంచి అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రూ.120 టికెట్‌కు రూ.170
నిర్మల్ నుంచి ఆదిలాబాద్‌కు సాధారణ బస్సులో టికెట్ ధర రూ.120 ఉండగా.. ప్రత్యేక బస్సులో రూ.170 వసూలు చేస్తున్నారని ప్రయాణికులు చెబుతున్నారు. అలాగే నిర్మల్ నుంచి మంచిర్యాలకు సాధారణ చార్జీ రూ.210 ఉండగా.. ప్రత్యేక బస్సులో రూ.260 తీసుకుంటున్నారని పేర్కొంటున్నారు. పండుగ రద్దీని ఆసరాగా చేసుకుని ప్రయాణికులపై అదనపు భారం మోపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.
ఒకే మార్గం.. చార్జీలో భారీ వ్యత్యాసం
నేరడిగొండ నుంచి ఆదిలాబాద్‌కు నిర్మల్ డిపోకు చెందిన బస్సులో ప్రయాణించిన ఓ వ్యక్తి నుంచి రూ.110 చార్జీ వసూలు చేసినట్లు సమాచారం. అదే ప్రయాణికుడు ఆదిలాబాద్ డిపో బస్సులో తిరిగి నేరడిగొండకు చేరుకోగా రూ.80 మాత్రమే సాధారణ చార్జీగా తీసుకున్నారని చెబుతున్నారు. ఒకే మార్గంలో, దాదాపు ఒకే దూరానికి చార్జీల్లో ఇంత వ్యత్యాసం ఎందుకు ఉందంటూ ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. ప్రత్యేక బస్సుల పేరుతో అదనపు వసూళ్లపై అధికారులు స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు.
మహిళలకు ఉచితం.. పురుషులపై అదనపు భారం?
మహిళలకు మహాలక్ష్మీ పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కొనసాగుతుండగా.. మరోవైపు ప్రత్యేక బస్సుల్లో పురుష ప్రయాణికులపై అదనపు చార్జీల భారం పడుతోందని ప్రయాణికులు అంటున్నారు. కుటుంబాలతో కలిసి పండుగ ప్రయాణాలు చేసే సమయంలో మహిళలకు ఉచిత ప్రయాణం ఉన్నప్పటికీ, పురుషుల టికెట్లపై అదనపు చార్జీలు కుటుంబాలపై ఆర్థిక భారంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పండుగల సమయంలో ప్రయాణికుల రద్దీ పెరగడం సహజమేనని, రద్దీని నియంత్రించేందుకు అదనపు బస్సులు నడపడం స్వాగతించదగ్గ విషయమేనని, అయితే ప్రత్యేక సర్వీసుల పేరుతో ప్రయాణికులపై అదనపు చార్జీల భారం మోపడం సరికాదని ప్రజలు అంటున్నారు. ఆర్టీసీ అధికారులు స్పందించి చార్జీలపై స్పష్టత ఇవ్వడంతో పాటు ప్రయాణికులపై అదనపు భారం లేకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

