కలం, వెబ్‌డెస్క్: నేడు రాఖీ పౌర్ణమి (Raksha Bandhan)ని పురస్కరించుకొని మంత్రి కొండా సురేఖ (Konda Surekha) సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్తూ ఓ వీడియో విడుదల చేశారు. సీఎం రేవంత్‌కు సురేఖ రాఖీ కడతారన్న వార్తలు ఊపందుకున్న వేళ ఆమె చేసిన పోస్ట్ మరింత ఆసక్తికరంగా మారింది. కొండా సురేఖ తన వీడియోలో రాష్ట్ర ప్రజలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అన్నదమ్ముళ్లకు అక్కలు, చెళ్లెల్లు రాఖీ కట్టి వారి గౌరవానికి, ప్రేమకు, ఆప్యాయతకు అనుబంధానికి ప్రతీకగా ఈ పండుగ జరుపుకొంటారని తెలిపారు. అన్నల ఆశీర్వాదం తీసుకొని అక్కా చెళ్లెల్లు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని ఆశీర్వదించడం జరుగుతుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా రాఖీ పండుగ జరుపుకుంటున్న వాళ్లందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
మరో పోస్టులో కొండా సురేఖ అక్క కట్టే రాఖీలో ప్రేమ ఉంటుంది.. అన్న ఇచ్చే మాటలో రక్షణ ఉంటుంది.. ఈ బంధంలో జీవితాంతం నిలిచే ఆప్యాయత ఉంటుంది.. అని రాసుకొచ్చారు. అన్నాచెల్లెళ్ల అనుబంధం ఎల్లప్పుడూ ఇలాగే చిరునవ్వులతో కొనసాగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. రాఖీ బంధం మరింత బలపడాలని, ప్రతి అన్నాచెల్లెలి జీవితాల్లో ప్రేమ, ఆనందం, సుఖసంతోషాలు నిండాలని ఆకాంక్షించారు.
ఈరోజు మధ్యాహ్నం కొండా సురేఖ సీఎం రేవంత్‌కు రాఖీ కడతారన్న వార్తలు వైరల్‌గా మారాయి. ఆమె ఇప్పటికే దీని కోసం సీఎం రేవంత్ అపాయింట్ మెంట్ కోరినట్లు తెలుస్తోంది. కానీ, సీఎం అపాయింట్ మెంట్ ఇవ్వలేదని ప్రచారం జరుగుతోంది. అయితే సీఎం అపాయింట్మెంట్ ఇవ్వకున్నా రాఖీ కట్టేందుకు వెళ్లాలని కొండా సురేఖ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఏం జరుగుతుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

