కలం, తెలంగాణ బ్యూరో : గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఫోకస్ పెట్టారు. గ్రేటర్‌లోని మూడు కార్పొరేషన్ల పరిధిలో చేపట్టిన డెవలప్మెంట్ ప్రాజెక్టులపై జులైలో సమీక్ష చేపట్టిన సీఎం.. ఆగస్టులో స్వయంగా రంగంలోకి దిగారు. గురువారం ఆకస్మికంగా మీరాలం చెరువు అభివృద్ధి పనులను పరిశీలించారు. అభివృద్ధి పనులను పరుగులు పెట్టించడంతో పాటు గ్రేటర్ ఎన్నికలకు ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేయడంలో భాగంగానే సీఎం ఆకస్మిక పర్యటన చేపట్టారని తెలుస్తున్నది.
మూడు కార్పొరేషన్ల పరిధిలో పలు కీలక ప్రాజెక్టులను ప్రభుత్వం చేపట్టింది. ఇందులో మూసీ పునరుజ్జీవం, ఫ్యూచర్ సిటీ, మెట్రో సెకండ్ ఫేజ్, ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ సహా ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లు, రోడ్ల విస్తరణ తదితర పనులు ప్రారంభించింది. మొత్తం 55 ప్రాజెక్టుల పనులకు సంబంధించి ఈ ఒక్క ఏడాదే దాదాపు రూ.10 వేల కోట్ల మేర విలువైన పనులను పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నది. ఈ పనులన్నీ పూర్తయితే అటు ప్రజలకు మౌలిక వసతులు అందుబాటులోకి రావడంతో పాటు ఇటు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు తెలిసింది. ఇది ఎన్నికల్లోనూ సర్కార్‌కు కలిసొస్తుందని ఆశిస్తున్నట్టు సమాచారం.
గ్రేటర్ హైదరాబాద్‌ను మూడు కార్పొరేషన్లుగా విభజించిన తర్వాత ఎన్నికలు జరగాల్సి ఉండగా.. సర్, జనాభా లెక్కల కారణంగా ఆ ప్రక్రియకు బ్రేక్ పడింది. ఈ రెండూ పూర్తయ్యే నాటికి దాదాపు ఏడాది పడుతుందని అంచనా. ఇంతలోపు అభివృద్ధి పనులన్నీ పూర్తి చేసి, ఎన్నికలు వెళ్తే బాగుంటుందని సీఎం భావిస్తున్నట్టు తెలుస్తున్నది. అందుకే అభివృద్ధి పనులపై వేగం పెంచినట్టు సమాచారం. ఇవన్నీ ప్రజల కంటికి కనిపించే పనులని, వీటిని పూర్తి చేస్తే ప్రభుత్వం చేసిన పనులు ప్రజలకు ప్రత్యక్షంగా కనిపించినట్లవుతుందని సీఎం యోచిస్తున్నట్టు తెలిసింది.
ఏడాదంతా పనులే..
మూసీ డెవలప్మెంట్, ఇందిరమ్మ ఇళ్లు, ఫ్యూచర్ సిటీ, ఎలివేటెడ్ కారిడార్లు, ట్రిపుల్ ఆర్, రోడ్లు, బ్రిడ్జీలు.. ఇలా వచ్చే ఏడాదంతా హైదరాబాద్ అభివృద్ధి పనుల పూర్తిపైనే ప్రభుత్వం ఫోకస్ పెట్టనుంది. ఇందులో భాగంగానే భూసేకరణ, టెండర్లు, శాఖల మధ్య సమన్వయం, పనుల పురోగతి వంటి అంశాలపై అధికారులకు సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నారు. ఈ పనులు నిర్ణీత గడువులోగా పూర్తయితే అటు ప్రజలకు, ఇటు పార్టీకి లబ్ధి చేకూరుతుందని సర్కార్ భావిస్తున్నది.
హైదరాబాద్ మహానగర అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. మున్సిపల్ శాఖను తన వద్దే ఉంచుకున్న సీఎం.. నగర అభివృద్ధిపై తనదైన ముద్ర ఉండాలని భావిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని పనులను వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. ఏడాది కాలంలో దాదాపు రూ.10 వేల కోట్ల విలువైన 55 ప్రాజెక్టుల పనులను పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు.
వీటిలో 30 ఫ్లైఓవర్లు ,15 అండర్ పాస్‌లు ,10 చోట్ల రోడ్ వైడెనింగ్ పనులు ఉన్నాయి. అలాగే కొంపల్లి నుంచి ప్యారడైజ్, ప్యాట్నీ నుంచి అల్వాల్ వైపు ఎలివేటెడ్ కారిడార్లు, మూసీ ప్రాజెక్టు తొలిదశ, కేబీఆర్ పార్క్ చుట్టూ ఎలివేటెడ్ కారిడార్, నల్గొండ చౌరస్తా నుంచి సంతోష్ నగర్ వైపు స్టీల్ బ్రిడ్జ్, మూసారాంబాగ్ వద్ద మూసీ నదిపై హైలెవల్ బ్రిడ్జ్, మీరాలం చెరువు అభివృద్ధి వంటి భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఈ పనులను ప్రారంభించారు.
దీంతో రానున్న ఏడాది కాలంలో పూర్తి చేయాలనేది సీఎం సంకల్పంగా తెలుస్తోంది. వీటిలో కొన్నింటి పనులు ఇటీవల ప్రారంభం కాగా.. కొన్ని సగంలో, మరికొన్ని తుదిదశకు చేరుకున్నాయి. మూసారాంబాగ్ బ్రిడ్జి పూర్తికావస్తుండటంతో త్వరలోనే సీఎం ప్రారంభించనున్నట్లు సమాచారం.
జులైలో సమీక్ష.. ఆగస్టులో రంగంలోకి
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, మూసీ తొలి దశ, ఫ్యూచర్ సిటీ, రోడ్లు, వంతెనలు, డ్రైనేజీ, ట్రాఫిక్ మేనేజ్మెంట్ వంటి అంశాలను ప్రభుత్వం ప్రాధాన్య జాబితాలో పెట్టింది. హైదరాబాద్‌ను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో సీఎం వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పనుల్లో వేగం పెంచేందుకు తానే స్వయంగా రంగంలోకి దిగారు. గురువారం మీరాలం చెరువు పనులను ఆకస్మికంగా పరిశీలించారు.
మూడు కార్పొరేషన్ల పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై జులైలోనే సీఎం ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. భూసేకరణ పూర్తికాకుండా టెండర్లు పిలవొద్దని, అనుమతుల ప్రక్రియను వేగవంతం చేసేందుకు అన్ని శాఖల మధ్య సమన్వయం పెంచాలని అధికారులను ఆదేశించారు. ఇప్పుడు తాజాగా ముఖ్యమంత్రినే రంగంలోకి దిగడంతో గ్రేటర్ అభివృద్ధి పనులపై ఆయన సీరియస్ దృష్టిపెట్టారని తెలుస్తున్నది.
ఇవీ కీలక ప్రాజెక్టులు..
మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. మొత్తం 55 కిలోమీటర్ల మేర మూసీని అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలి దశలో 21 కిలోమీటర్ల పనులు చేపపట్టింది. ఇందులో వరద నియంత్రణ, మురుగునీటి నివారణ, ఈస్ట్-వెస్ట్ కారిడార్, బాపూఘాట్ వద్ద గాంధీ సరోవర్ తదితర ఉన్నాయి.
మూసీ ప్రాజెక్టుతో పాటు ఇతర మౌలిక వసతుల పనులను కూడా వేగవంతం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. రోడ్లు, వంతెనలు, నాలాలు, ట్రాఫిక్ జంక్షన్లు, డ్రైనేజీ వ్యవస్థ, ప్రజా రవాణా వంటి రంగాల్లో పూర్తయిన ప్రాజెక్టులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నది.
హైదరాబాద్ ప్రజలు ఏళ్లుగా ఎదురుచూస్తున్న మూసారాంబాగ్ హైలెవల్ బ్రిడ్జి తుది దశకు చేరుకుంది. సుమారు రూ.52 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఈ ఆరు లేన్ల వంతెనపై బీటీ పనులు కొనసాగుతున్నాయి. త్వరలోనే పనులు పూర్తయ్యే అవకాశముంది. ఈ వంతెన అందుబాటులోకి వస్తే మూసీ వరదల సమయంలో ఎదురయ్యే రాకపోకల ఇబ్బందులతో పాటు అంబర్‌పేట-దిల్సుఖ్నగర్ మార్గంలోని ట్రాఫిక్ సమస్యలకు కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంది.
‘క్యూర్’ పరిధిలో ఏడాదిలోగా లక్ష ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకున్నది. తొలి దశలో 20 నియోజకవర్గాల్లో ఒక్కో సెగ్మెంట్లో 500 చొప్పున 10 వేల ఇండ్ల నిర్మాణం చేపడుతున్నది. వీటిని అర్బన్ ఇందిరమ్మ టవర్స్‌గా నిర్మిస్తున్నది. టవర్ల నిర్మాణాకి ఇటీవల కూకట్‌పల్లిలో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) శంకుస్థాపన చేశారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మరో ప్రాజెక్టు ఫ్యూచర్ సిటీ. ఫ్యూచర్ సిటీ, రీజినల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్లు, మెట్రో విస్తరణ, మూసీ పునరుజ్జీవనం వంటి ప్రాజెక్టులను పరస్పరం అనుసంధానిస్తూ సిటీ ఎకానమీ పుంజుకునేలా చేయాలన్నది సర్కార్ ప్రణాళిక. మెట్రో సెకండ్ ఫేజ్, ట్రిపుల్ ఆర్, రేడియల్ రోడ్లు తదితర పనులపైనా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.

